వైఎస్సార్ సీపీ విజయదుందుభి : సామినేని
కంచికచర్ల, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎంపీటీసీ,జెడ్‌పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయదుందుభి మోగిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను స్పష్టం చేశారు. జెడ్‌పీటీసీ అభ్యర్థి కాలవ వాసుదేవరావు స్వగృహంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో సామినేనితోపాటు జెడ్‌పీ చైర్‌పర్సన్ అభ్యర్థిని తాతినేని పద్మావతి, రాష్ట్ర ప్రచారకమిటీ కన్వీనర్ విజయచందర్ పాల్గొన్నారు.
ఉదయభాను మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న జెడ్‌పీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించి జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం అత్యధిక మున్సిపాల్టీలు వైఎస్సార్ సీపీ ఖాతాలో జమ అవుతాయని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ బలం రోజురోజుకూ తగ్గిపోతుందన్నారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు బీజేపీతో పొత్తుకు వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఏ పార్టీతోనైనా జతకట్టేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్నారు.
రాష్ట్రంలో 9 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సొంతంగా పోటీచేసే దమ్ములేకే పొత్తులకోసం ఎదురుచూస్తుందని ఆరోపించారు. చివరకు పవన్‌కల్యాణ్ పార్టీతో కూడా పొత్తుకు సిద్ధపడుతుందంటే అధికారం కోసం టీడీపీ ఏ విధంగా అర్రులు చాస్తుందో ఇట్టే అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజాకర్షణ కలిగిన నాయకుడు కేవలం వైఎస్. జగన్‌మోహనరెడ్డి మాత్రమేనన్నారు. రాష్ట్రంలో జరిగే సాధారణ ఎన్నికల్లో జగన్ నాయకత్వంలో వైఎస్సార్ సీపీ రాష్ట్రంలో 140 స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని చెప్పారు. విజయచందర్ మాట్లాడుతూ తాను రాష్ట్రంలోని దాదాపుగా అన్ని జిల్లాల్లో పర్యటించానని అక్కడి ప్రజల మనోభావాలను తెలుసుకున్నానన్నారు.
ప్రతిఒక్కరూ ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్, బీజేపీపై కసితో ఉన్నారని, ఆ రెండు పార్టీలను భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నార ని తెలిపారు. రాజకీయాల్లో చిరంజీవిది ఐరన్‌లెగ్ అన్నారు. ఆయన పెట్టిన పీఆర్పీ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవిచూసిందని, అనంతరం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారని, ఫలితంగా కాంగ్రెస్ పార్టీ కూడా భ్రష్టుపట్టిందన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా తనను ప్రకటించడం తనకు ఎంతోసంతోషాన్నిచ్చిందని తాతినేని పద్మావతి పేర్కొన్నారు.
జిల్లాలో అత్యధిక జెడ్‌పీటీసీ స్థానాలను గెలుచుకుని చైర్మన్ పదవిని వైఎస్సార్ సీపీ దక్కించుకుంటుందన్నారు. జెడ్‌పీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటానని చెప్పారు. మండల పార్టీ కన్వీనర్ బండి జానకిరామయ్య, సర్పంచిగద్దె ప్రసాద్, దాసరి రాము, కోనా సుబ్బారావు, ఎంపీటీసీ అభ్యర్థిని నిమ్మగడ్డ కరుణ, పెదమళ్ల భద్రయ్య పాల్గొన్నారు.