
వైఎస్సార్‌సీపీయే నంబర్‌వన్
ఎన్టీవీ-నీల్సన్ సర్వే వెల్లడి
59-63 స్థానాల తో రెండో స్థానంలో టీఆర్‌ఎస్
48-54 స్థానాలతో టీడీపీకి మూడో స్థానం
కాంగ్రెస్‌కు కేవలం 28 నుంచి 35 సీట్లు
25 లోక్‌సభ స్థానాలు కూడా వైఎస్సార్‌సీపీవే
టీఆర్‌ఎస్‌కు 8-10; కాంగ్రెస్, టీడీపీలకు 3-5
సీఎంగా 50 శాతం మంది సీమాంధ్రుల ఓటు జగన్‌కే
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు 39 శాతం ఓట్లు
బాబుకు సీమాంధ్రలో 38, తెలంగాణలో 19 శాతం ఓట్లు
సాక్షి, హైదరాబాద్: ఎన్టీవీ-నీలన్స్ నిర్వహించిన సర్వే ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన నిలిచింది. నీల్సన్ నిర్వహించిన సర్వే ఫలితాలను రెండు రోజులుగా ఎన్టీవీ ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. తొలి రెండు రోజుల్లో వరుసగా రాయలసీమ, కోస్తాంధ్రల్లో చేసిన సర్వే ఫలితాలను వెల్లడించిన ఎన్టీవీ, తాజాగా శనివారం తెలంగాణ ప్రాంతం వివరాలను ప్రసారం చేసింది. మూడు ప్రాంతాల్లో కలిపి మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 132 నుంచి 145 స్థానాలు గెలుచుకుంటుందని సర్వేలో వెల్లడైంది. ఇక టీఆర్‌ఎస్ ఒక్క తెలంగాణకే పరిమితమైనప్పటికీ అక్కడ 59 నుంచి 63 స్థానాలు గెలుచుకుని రాష్ట్రంలో రెండో అతి పెద్ద పార్టీగా నిలుస్తుందని తేలింది.
48-54 సీట్లతో టీడీపీ మూడో స్థానానికి పరిమితమవుతుందని, కేవలం 28-35 సీట్లతో అధికార కాంగ్రెస్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంటుందని వెల్లడైంది. బీజేపీ 7-10 సీట్లు గెలుచుకోనుంది. రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీకి 39 నుంచి 44 సీట్లు, కోస్తాంధ్రలోని మొత్తం 123 స్థానాల్లో 87 నుంచి 95 స్థానాలు దక్కనున్నాయి. తెలంగాణలో పార్టీకి 5 నుంచి 8 అసెంబ్లీ స్థానాలు వస్తాయని తేలింది. ఈ లెక్కన మూడు ప్రాంతాల్లో కలిపి వైఎస్సార్‌సీపీకి 132 నుంచి 145 స్థానాలు దక్కుతాయని సర్వే వెల్లడించింది. ఇక సీమలో టీడీపీకి 7-10, కోస్తాంధ్రలో 23-27, తెలంగాణలో 14-17 స్థానాలు వస్తాయని తేలింది. కాంగ్రెస్ అయితే సీమలో 2-4 స్థానాలు, కోస్తాంధ్రలో 0-2 స్థానాలు, తెలంగాణలో 19-24 స్థానాలకే పరిమితం కానుంది. రాష్ట్ర విభజన క్రెడిట్ టీఆర్‌ఎస్‌కే దక్కనున్నట్టు సర్వే తేల్చింది. హడావుడిగా తెలంగాణ ఏర్పాటును ప్రకటించి లబ్ధి పొందాలన్న కాంగ్రెస్ ఆశలు అడియాసలే కానున్నాయని పేర్కొంది. ఎంఐఎం 7 సీట్లు గెలుచుకోవచ్చని సర్వే వెల్లడించింది. మిగతా స్థానాలు బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఇతరులకు దక్కుతాయని తెలిపింది.
లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ హవాయే
రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే అసెంబ్లీ ఎన్నిక ల్లో మాదిరిగానే లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీయే ప్రభంజనం సృష్టిస్తుందని నీల్సన్ సర్వే పేర్కొంది. ఏకంగా 23-25 ఎంపీ సీట్లను పార్టీ గెలుచుకుంటుందని వెల్లడించింది. టీ ఆర్‌ఎస్ 8-10 ఎంపీ సీట్లు గెల్చుకోవచ్చని, కాంగ్రెస్‌కు కేవలం 3 నుంచి 5 సీట్లే వస్తాయని పేర్కొంది. టీడీపీ కూడా 3 నుంచి 5 స్థానాలతోనే సరిపెట్టుకోనుంది. బీజేపీకి ఒక స్థానం రావచ్చని, ఇతరులకు రెండు ఎంపీ సీట్లు దక్కుతాయని, వాటిలో హైదరాబాద్‌ను మజ్లిస్ చేజిక్కించుకోవచ్చని సర్వే పేర్కొంది.
సీమాంధ్ర సీఎంగా జగన్‌కే ఓటు
2014లో కాబోయే ముఖ్యమంత్రిగా ఎవరికి ఎక్కువ ప్రజాదరణ ఉందన్న ప్రశ్నకు సీమాంధ్ర ప్రాంతం మొత్తం నుంచి సర్వే సమాచారం సేకరించింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చూడాలని ఏకంగా 50 శాతం మంది సీమాంధ్రులు కోరుకున్నారు. 38 శాతం మంది చంద్రబాబును, 12 శాతం మంది ఇతర నేతలను సీఎంగా కోరుకున్నారు.
తెలంగాణలో ఓట్ల శాతం
టీఆర్‌ఎస్‌కు 32 శాతం, కాంగ్రెస్‌కు 26 శాతం, టీడీపీకి 20 శాతం, బీజేపీ 8.5 శాతం, వైఎస్సార్‌సీపీకి 7శాతం, మజ్లిస్, సీపీఐ, సీపీఎం, ఇతర పార్టీలకు 6.5 శాతం
తెలంగాణ ముఖ్యమంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు అనే ప్రశ్నతో ఈ సర్వే నిర్వహించారు. కేసీఆర్‌ను సీఎంగా చూడాలని 39 శాతం ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో బలమైన కేడర్ ఉందని టీడీపీ చెప్పుకుంటున్నప్పటికీ చంద్రబాబును సీఎంగా కోరుకుంటున్న వారు 19 శాతమే. తెలంగాణలో 9 శాతం ప్రజలు వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా కోరుకున్నారు. మరో 9 శాతం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు సీఎంగా ఓటేశారు.
ఎంపీ సీట్లలోనూ టీఆర్‌ఎస్సే
తె లంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ 8-10 స్థానాలను గెలుచుకోనుంది. కాంగ్రెస్‌కు కనాకష్టంగా 1 నుంచి 3, టీడీపీకి 1 నుంచి 2 స్థానాలు దక్కనున్నాయి. సమైక్యవాదంతో ముందుకెళ్లనున్న వైఎస్సార్‌సీపీకి తెలంగాణలో ఒక లోక్‌సభ స్థానం దఖలు పడే అవకాశాలున్నాయి.