సాక్షి, విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో హిందుధర్మంపై దాడి జరుగుతోందని వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు ఆరోపించారు. టీడీపీ నేతలు అర్చకులు, పురోహితులు, దేవాలయాలపై దాడులకు పాల్పపడుతున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గుప్తనిధుల తవ్వకం అడ్డుకున్నాడని, మల్లికార్జున శర్మ అనే వ్యక్తిని తీవ్రంగా అవమానించారని అన్నారు. గాంధీ జయంతి రోజున తూర్పుగోదావరి జిల్లాలో మల్లికార్జున శర్మ అనే పురోహితుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పురోహితుడు ఆత్మహత్యకు పాల్పడినా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన మండిపడ్డారు. తిరుమల స్వామివారి అభరణాలు మాయం అయితే విచారణ కూడా జరగలేదని, దుర్గగుడిలో క్షుద్రపూజలు చేసిన వారిపై ఇప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.
ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు పాలనలో హిందుధర్మానికి రక్షణ కరువైంది. ఏకంగా అమ్మవారి చీరనే దొంగిలించారు. హిందూధర్మ పరిరక్షణ రాష్ట్రంలో కరువైంది. అర్చకులకు జీతాలు పెంచలేదు. పురోహితుల పరిస్థితి దయనీయం. టీటీడీలో అక్రమాలు, అన్యాయాలు ప్రశ్నిస్తే రమణ దీక్షితుల్ని తొలగించారు. చంద్రబాబుకు అర్చకులు, పురోహితులు అంటే ఎందుకు అంత ద్వేషం?. మల్లికార్జున శర్మ కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వాలి. ఘటపై విచారణ జరిపించాలి’ అని అన్నారు.
మహాకూటమి మాయగాడు..
చంద్రబాబుకి బుద్దిచెప్పే రోజు త్వరలోనే రానుందని వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిజ స్వరూపాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ బయటపెట్టారని అన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపెట్టుకోవడం దౌర్భాగ్యంమని.. బాబు మహాకూటమి మాయగాడని ఆయన ఎద్దేవా చేశారు. పలు సర్వేలు ఏపీలో వైఎస్ జగన్ సీఎం అవుతారని తేల్చిచెప్పాయని, చంద్రబాబుని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment