
'విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారథి డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలను ఎందుకు పెంచారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని అన్నారు.
చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్న తొమ్మిదేళ్ల పాలనలో ఆరుసార్లు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని పార్థసారథి విమర్శించారు. ఇప్పుడు ఏడాదిలోపే మళ్లీ విద్యుత్ ఛార్జీలు పెంచారని పేర్కొన్నారు. దివంగత మహానేత వైఎస్ఆర్ సీఎంగా ఉన్న కాలంలో ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచలేదని పార్థసారథి గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు అన్నీ ఛార్జీలు పెంచే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు.