ఎందుకు భయపెడతారు?
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత వాసుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అనవసరంగా భయాందోళనలు సృష్టిస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి మండిపడ్డారు. ఇప్పుడు రాకెట్ లాంచర్ల ప్రస్తావన ఎందుకు తెచ్చారని ఆయన ప్రశ్నించారు. వాటి పేరుతో సచివాలయ నిర్మాణ వ్యయ అంచనాలను ఇబ్బడిముబ్బడిగా పెంచుతున్నారన్నారు. ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారని రేపు ఎవరైనా ప్రశ్నిస్తే అడ్డం పెట్టుకోడానికి మొట్టమొదటగా ఆయన రాకెట్ లాంచర్లతో ప్రారంభించడం దారుణమని వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్థసారథి బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇదే ముఖ్యమంత్రి, తాను గెలవగానే టీడీపీ కేడర్‌ను ఉద్దేశిస్తూ.. తాను పదేళ్లు హైదరాబాద్‌లోనే ఉంటానని చెప్పారని, తెలంగాణలో టీడీపీని గెలిపించి విజయవాడ వెళ్తానన్నారని.. కానీ గట్టిగా రెండేళ్లు కూడా పూర్తిచేయకుండానే హడావుడిగా విజయవాడకు ఎందుకు పరుగులు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నిజానికి ఆయన రాష్ట్రంలో ఉండే రాష్ట్రాన్ని పాలించడం తమకూ సంతోషకరమేనని.. అభ్యంతరం ఏమీ లేదని అన్నారు. కానీ.. కుర్చీలు, ఫ్యాన్లకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో అప్పుడే ఎందుకు తాత్కాలిక భవనాలకు వెళ్లారని ప్రజలకు అనుమానంగా ఉందని చెప్పారు. ఓటుకు కోట్ల కేసులో తెలంగాణ పోలీసుల నుంచి ముప్పు ఉంటుందన్న భయంతోనే వచ్చేశారని తెలిపారు. సింగపూర్, టోక్యో, చైనా అన్నీ కడతామన్న సీఎం.. కనీసం తాత్కాలిక భవనాన్ని నిర్మించడం మంచిదేనని.. కానీ ప్రతీదీ అశుభంగా ఎందుకు చేస్తున్నారని పార్థసారథి ప్రశ్నించారు.
ఇక చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చేసిన సంతకాలలో ఒక్కటి కూడా ఇంతవరకు అమలుకాలేదని పార్థసారథి గుర్తుచేశారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీ, బెల్టు షాపులనిర్మూలన, ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా అందరికీ మినరల్ వాటర్ సరఫరా చేసే సంతకం.. వాటిలో ఏదైనా ప్రజలకు సంతృప్తికరంగా జరిగిందా అని ప్రశ్నించారు. ఇప్పుడు డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి అప్రూవ్ చేశామంటున్నారని.. ఇప్పటికైనా ఒక్క మహిళకైనా ఒక్క రూపాయి ఆమె చేతిలో పడిందని నిరూపిస్తే వాళ్లు వేసే శిక్ష అనుభవించడానికి తాను సిద్ధమని సవాలు చేశారు.
మరోవైపు నల్లధనం గురించి చంద్రబాబు మాట్లాడటం చూస్తే దేశంలో ప్రజలంతా విస్తుపోతున్నారు. దేశంలోనే అతి ధనవంతుడైన ముఖ్యమంత్రి కలిగినది ఏపీ అని సర్వే సంస్థలు చెప్పిన విషయం నిజమా కాదా అని ప్రశ్నించారు.
కేంద్రం ప్రకటించిన అక్రమ ఆదాయ వెల్లడి పథకం గురించి ఆయన మాట్లాడారని, ఏ ప్రాంతం నుంచి ఎంత నల్లడబ్బు వచ్చిందన్న విషయాన్ని తాము చెప్పబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే పట్టించుకోవద్దని చెప్పారని అన్నారు. కానీ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో ఇంత డబ్బు వచ్చిందని, అది కూడా ఒకే వ్యక్తి, ఒకే సంస్థ పదివేల కోట్లు వెల్లడించిందని ఎలా చెబుతున్నారని నిలదీశారు. తప్పుడు, దొంగ ప్రచారాలు చేస్తున్నారా.. మీవాళ్ల ద్వారా తెలుసుకుని ప్రచారం చేస్తున్నారా అని అడిగారు.
ఇలా ముఖ్యమంత్రి 'ఒక వ్యక్తి' అంటూ ముందురోజు మాట్లాడతారని.. మర్నాడు జగన్ పదివేల కోట్లు వెల్లడించాని కేబినెట్‌లో మంత్రులు ఆరోపిస్తారని పార్థసారథి అన్నారు. ఇలా పథకం ప్రకారం జగన్ మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వాళ్లుకు నీతి, నిజాయితీ, సిగ్గు, లజ్జ ఉంటే.. కనీసం ఒక శాతమైనా నిజాయితీ ఉందని అనుకుంటే.. తమ సవాలు స్వీకరించాలన్నారు. ఈ పదివేల కోట్ల రూపాయలు ఎవరు వెల్లడించారో ఆధారాలతో సహా బయటపెట్టాలని పార్టీ తరఫున సవాలు చేస్తున్నామన్నారు.