అర్తమూరు (మండపేట): ప్రభుత్వ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే పేరు పెట్టడమేంటీ? అని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ నేత కర్రి పాపారాయుడిపై అధికార పార్టీ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి వీరంగం చేశారు. పక్కకు గెంటివేసి పరుష పదజాలంతో దూషించారు. అధికార జులుం ప్రదర్శించారు. దీంతో వీర్రెడ్డి తీరును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ నేతలు ఆందోళనకు దిగారు. పంచాయతీ కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు.
మండపేట మండలం అర్తమూరు నుంచి అనపర్తి వెళ్లే రోడ్డులోని ఎస్‌బీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్టు కార్యాలయం సెంటర్ నుంచి తుల్యభాగ నది వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మించారు. మొత్తం రూ.కోటి రూపాయల వ్యయానికిగాను ఉపాధి హామీ నిధులు రూ.76 లక్షలు, పంచాయతీ నిధులు రూ.12 లక్షలు, ఎస్‌డీఎఫ్ నిధులు రూ.12 లక్షలు మంజూరయ్యాయి. ఈ రోడ్డును ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుతో ప్రారంభింపజేసేలా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, అధికారపార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
అంతేకాదు రోడ్డుకు ఆయన పేరు పెడుతూ ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. దీనిపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు పంచాయతీ కార్యాలయానికి చేరుకుని గ్రామ కార్యదర్శి శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. ఎమ్మెల్యే పేరు పెడుతూ పంచాయతీ తీర్మానం చేశారా? గ్రామసభ ఎప్పుడు పెట్టారో చెప్పాలని కోరారు. పంచాయతీ తీర్మానం ఉందని, లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకుంటే సమాచారం ఇస్తామని ఈఓ శ్రీనివాస్ పేర్కొన్నారు. గ్రామసభ తేదీ చెప్పాలని పాపారాయుడు కోరగా అందుకు ఈఓ శ్రీనివాస్ సరైన సమాధానం చెప్పకుండా బయటకు వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీంతో పాపారాయుడు పంచాయతీ గుమ్మం వద్ద బైఠాయించారు. ఇంతలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీర్రెడ్డి పంచాయతీ కార్యాలయానికి చేరుకుని ప్రారంభోత్సవ ఏర్పాట్లు చూడమంటూ ఈఓ శ్రీనివాస్‌ను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు.
తనకు సమాధానం చెప్పాలంటూ పాపారాయుడు ఈఓను అడ్డుకునే ప్రయత్నం చేయగా వీర్రెడ్డి ఆయనను పక్కకు గెంటి పరుష పదజాలంతో దూషించా రు. దీంతో ఇరువురు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొవ్వూరి గంగిరెడ్డి, సత్తి సాహెబ్‌రెడ్డి, ద్వారంపూడి బులివీర్రెడ్డి, కర్రి సత్యం, కర్రి సురేష్‌రెడ్డి తదితరులు వీర్రెడ్డిని వారించే ప్రయత్నం చేశారు. వీర్రెడ్డి దౌర్జన్యాన్ని నిరసిస్తూ పాపారాయుడు, తదితరులు పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. విషయం తెలిసి వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు, పార్టీ నాయకులు పిల్లా వీరబాబు, తుపాకుల ప్రసన్నకుమార్ తదితరులు గ్రామానికి చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు. ధర్నా అనంతరం పాపారాయుడు, వెంకన్నబాబు, పార్టీ నాయకులు మాట్లాడుతూ వీర్రెడ్డి వైఖ రిని తీవ్రంగా ఖం డించారు. అధికారపార్టీ నేతల దౌర్జన్యాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని పాపారాయు డు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment