వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోప్రగతే లక్ష్యం
- అంతర్జాతీయ విమానాశ్రయంగా గన్నవరం
- 8 లైన్లుగా జాతీయరహదారి నిర్మాణం
- గ్యాస్ వినియోగదారులకు ఊరట
- స్థిరీకరణ నిధితో రైతుకు మేలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రగతి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కనిపించింది. అభివృద్ధిలో జిల్లాకు సముచితమైన చోటు దక్కింది. జిల్లా అభివృద్ధికి వరాలు ప్రకటించడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం విడుదల చేసిన మేనిఫెస్టోలో జిల్లాకు చోటు లభించింది. ఇతర పార్టీల మాదిరిగా ఆచరణకు సాధ్యంకాని హామీలను గుప్పించకుండా ప్రజాసమస్యల పరిష్కారం, నూతన రాజధాని నిర్మాణంతో పాటు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని ఆచరణాత్మకమైన హామీలను మేనిఫెస్టోలో చేర్చింది. అన్నదాతలు మొదలుకొని విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఇలా అన్ని వర్గాలకు మేలు చేసేలా తయారుచేసిన మేనిఫెస్టోని ఆదివారం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. ముఖ్యంగా జిల్లాకు వరాలు ప్రకటించారు.
అంతర్జాతీయ విమానాశ్రయంగా ‘గన్నవరం’...
ప్రధానంగా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ప్రసుత్తం విమానాశ్రయం 500 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనిని విస్తరించాలని మరో 400 ఎకరాల భూసేకరణకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా తొలి ప్రాధాన్య అంశంగా దీనిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దనున్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో తొలుత ఒక వృద్ధాశ్రమం, అనాథాశ్రమం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు, ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు, మండలంలో 102 సేవలు ప్రారంభం ఇలా అనేక ఆచరణాత్మక హామీలను పార్టీ ప్రకటించింది. మేనిఫెస్టో ప్రకటనపై జిల్లాలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అన్ని అంశాలపై, అన్ని వర్గాల ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని దీనిని రూపొందించారని, జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రజల కష్టాలు కచ్చితంగా తొలగుతాయని మేనిఫెస్టో ద్వారా రుజువైందనే అభిప్రాయం జిల్లాలోని అన్నివర్గాల ప్రజల్లో వ్యక్తమవుతోంది.
అన్నదాతకు మేలు...
జిల్లాలో 7.35 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు ఉన్నాయి. ప్రధానంగా 6.35 లక్షల ఎకరాల్లో వరి, 1.30 లక్షల ఎకరాల్లో పత్తి, 45 వేల ఎకరాల్లో చెరుకుతో పాటు ఉద్యానవన పంటలు సుమారు 25 వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. ముఖ్యంగా వరి రైతుకు పంట సాగుకు క్వింటాలుకు సగటున రూ.1766 వరకు ఖర్చు అవుతుంటే ప్రభుత్వం రూ.1,355 మద్దతు ధర ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా వారు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఇది రైతులకు పూర్తిగా మేలు చేస్తుంది. అమ్మ ఒడి పథకం ద్వారా వేలాది మంది విద్యార్థులు పూర్తిస్థాయిలో చదువుకునే అవకాశం కల్పించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 70 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 2.50 లక్షల ఎకరాలకు విద్యుత్ మోటార్ల ద్వారానే నీటి సరఫరా జరగాల్సి ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొమ్మిది గంటల పాటు నిరంతరంగా వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా చేస్తారు.
గ్యాస్ భారం నుంచి ఊరట...
ముఖ్యంగా భారంగా మారిన గ్యాస్ ధరల నుంచి ప్రజలకు కొంత ఊరట కలగనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెరిగిన గ్యాస్ ధరలో రూ.100ను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. తద్వారా జిల్లాలో 11.61 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలగనుంది. పింఛనుదార్లకు నెలకు రూ.500 అదనంగా అందనున్నాయి.