టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారు
అసెంబ్లీ కార్యదర్శిపై ఎమ్మెల్యే ఆర్‌కే మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ఏపీ శాసనసభ కార్యదర్శిగా కొనసాగడానికి అర్హతల్లేని కె.సత్యనారాయణను తక్షణం పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్హతల్లేవని తెలిసీ ఆ పదవిలో కొనసాగిస్తున్నా రంటే సీఎం చంద్రబాబుకు ఆయనతో ఉన్న లాలూచీ ఏమిటని ప్రశ్నించారు. బుధవారం పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సత్యనారాయణ నిబంధనల ప్రకారం వ్యవహరించకుండా టీడీపీ కార్యకర్తలా పనిచేస్తు న్నారని తప్పుపట్టారు. రెండేళ్లుగా కార్యదర్శి విద్యా ర్హతల గురించి సమాచారమడుగుతున్నా ఇవ్వట్లేదన్నారు.
ఇదే విషయమై తాను సమాచారహక్కు చట్టం కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తే మూడు నెలల క్రితం అసెంబ్లీ పీఐఓకు రూ.15వేలు జరిమానా విధించారని తెలిపారు. తాను స్వయంగా స్పీకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ కార్యాలయా లకెళ్లి సమాచారం కావాలని కోరినా ఇవ్వలేదని తెలిపారు. కార్యదర్శిపై బంజారాహిల్స్‌లో క్రిమినల్ కేసు నమోదై నాంపల్లి కోర్టులో కేసు నడుస్తోందని, ప్రభుత్వోద్యోగిపై కేసు ఉన్నపుడు పదవినుంచి తప్పించి విచారణనుంచి బయటికొచ్చాకే మళ్లీ పదవివ్వాలని సీసీఏ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయన్నారు.