
అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యే చెవిరెడ్డి దీక్ష
♦ ఎంపీ కేశినేని బృందాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్
♦ భగ్నం చేసిన మార్షల్స్, పోలీసులు..
♦ మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో ఆరు గంటల నిర్బంధం
సాక్షి, అమరావతి: వెలగపూడి తాత్కాలిక అసెంబ్లీ ఆవరణలో చిత్తూరు జిల్లా చంద్రగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోమవారం ఉదయం చేపట్టిన దీక్ష తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడ నగరంలో రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎన్ బాలసుబ్రహ్మణ్యాన్ని నిర్బంధించి, దూషిస్తూ దాడికి యత్నించిన తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఉదయం 8.50 గంటలకు నాలుగో నంబరు గేటు లోపల అసెంబ్లీ ఎదురుగా దీక్ష చేపట్టారు. ఆయనకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు.
హైడ్రామా నడుమ దీక్ష భగ్నం
నల్ల దుస్తులు ధరించి దీక్ష చేపట్టిన చెవిరెడ్డి వద్దకు ఉదయం 10.05 గంటలకు చీఫ్ మార్షల్ గణేష్ నేతృత్వంలోని బృందం వచ్చిం ది. ఇక్కడ దీక్ష చేసేందుకు వీలు లేదని విరమించాలని కోరారు. అదే సమయంలో గుంటూరు జిల్లా ఎస్పీ నారాయణనాయక్, ఏఎస్పీ విక్రాంత్ పాటిల్‌లు తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. రోప్ పార్టీ సహాయంతో మార్షల్స్ ఎమ్మెల్యే చెవిరెడ్డిని ఎత్తుకొని గేటు బయట ఉంచిన వాహనంలోకి తీసుకెళ్లేందుకు యత్నించగా, ఆయన గట్టిగా ప్రతిఘటించి గేటు ముందు భైఠాయించారు.
అయినా పోలీసులు, మార్షల్స్ అందరినీ పక్కకు నెట్టి 10.25 గంటలకు చెవిరెడ్డిని పోలీస్ వాహనంలోకి ఎక్కించి తీసుకుపోయారు. ఎమ్మెల్యే చెవిరెడ్డిని పోలీసులు మంగళగిరి పోలీస్టేషన్‌లో ఆరు గంటలపాటు నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి, తదితరులు పోలీస్టేషన్‌కు చేరుకున్నారు. వారిని స్టేషన్ ప్రాంగణంలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం 4.15 గంటలకు చెవిరెడ్డిని విడిచిపెట్టారు.
మీకో చట్టం... నాకో చట్టమా?
టీడీపీ నేతలకు ఒక చట్టం, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేనైన తనకు ఓ చట్టం అమలు చేస్తారా అంటూ సీఎం చంద్రబాబును చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు.ఈ మేరకు ఆయన సీఎంకు ఓ బహిరంగ లేఖరాశారు.