'ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని క్షుద్ర రాజకీయాలు'
తిరుపతి: ఎల్లోమీడియాను అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు క్షుద్రరాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో వైఎస్ఆర్ సీపీ కార్యకర్త విజయానందరెడ్డిని నేను కలవడాన్ని ఎల్లోమీడియా చిలువలు వలువలుగా వక్రీకరించిందని చెవిరెడ్డి మండిపడ్డారు. విజయానందరెడ్డిని కలవడాన్ని తాను నూటికి నూరు శాతం సమర్థించుకుంటున్నానని చెవిరెడ్డి అన్నారు.
వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆపదలో ఉంటే వారు ఏ జైలులో ఉన్నా కలిసేందుకు వెనుకాడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు, రెడ్డి నారాయణ, మహేష్ నాయుడులు పీడీ యాక్ట్ కింద గతంలో అరెస్ట్ అయ్యారన్నారు.
వీరికి స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు బీఫారంలు ఇచారని.. అంటే బాబుకు ఎర్రచందనం స్మగ్లింగ్‌తో సంబంధమున్నట్లేనా అని చెవిరెడ్డి ప్రశ్నించారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలను అంతమొందించాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హెచ్చరించారు.