
రౌడీయిజానికి అడ్డాగా రాజధాని
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని రౌడీయిజానికి అడ్డాగా మారిందని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. సోమవారం ఉదయం అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద మాట్లాడిన రోజా.. 'లా అండ్ ఆర్డర్‌ను తనలా ఎవరూ కంట్రోల్ చేయలేరని అసెంబ్లీలో చెప్పే చంద్రబాబు.. ఇప్పుడు రౌడీయిజానికి అండగా నిలుస్తున్నారు' అని మండిపడ్డారు.
ఆర్టీఏ అంశంలో సెటిల్మెంట్ చేయడం ద్వారా సీఎం.. 'చీప్ మినిస్టర్' అనిపించుకున్నారని రోజా ఎద్దేవా చేశారు. గతంలో వనజాక్షి, జానిమూన్ విషయంలోనూ సీఎం ఇదే విధంగా సెటిల్మెంట్ చేశారని ఆమె గుర్తు చేశారు. బస్సు ప్రమాదం ఘటన సందర్భంగా జగన్ ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి సారీ చెప్పలేదని, ఇప్పుడు తప్పు చేసి కూడా 'మేం సారీ చెప్పం' అని బోండా ఉమ నిస్సిగ్గుగా చెబుతున్నారని రోజా అన్నారు.
టెంపరరీ డీజీపీ ప్రతిపక్షంపై కేసులు పెట్టడంలో ముందున్నారని, ప్రజలను కాపాడటంలో మాత్రం ఆయనకు శ్రద్ధ లేదని రోజా విమర్శించారు. రాష్ట్రంలో నారావారి నరకపాలన కొనసాగుతుందని, రౌడీయిజాన్ని అరికట్టడానికి చేతగాని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.