మాట్లాడుతున్న గొల్ల బాబూరావు
పాయకరావుపేట: సమయం లేదు మిత్రమా.. అన్నట్టు వైఎస్సార్‌సీపీ పాయకరావుపేట అసెంబ్లీ సెగ్మెంటులో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. పోలింగ్‌కు పది రోజులు మాత్రమే సమయమున్నందున ప్రచారంలో జోరు పెంచింది. అభ్యర్థి గొల్ల బాబూరావు పార్టీ శ్రేణులతో నియోజకవర్గంలో కలియతిరుగుతున్నారు. ప్రత్యర్థుల కంటే ఓ అడుగు ముందులో ఉంటున్నారు. సోమవారం పాయకరావుపేట పట్టణంతోపాటు, ఈదటం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు సామాజికవర్గాల పెద్దలను కలిసి మద్దతు కోరారు. రజకపేట, కరణంగారి వీధి, బృందావనం ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల జిమ్మిక్కులకు పాల్పడుతున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
బీసీ డిక్లరేషన్ ద్వారా వెనుకబడిన వర్గాలకు పెద్ద పీట వేసి సాహసోపేతమైన సంక్షేమ పథకాలు ప్రకటించిన ఘతన జగన్‌కే దక్కుతుందన్నారు. గత ఎన్నికల నాటి ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు పాయకరావుపేట ఎమ్మెల్యేగా తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ ప్రచారంలో పార్టీ మండలశాఖ అధ్యక్షుడు ధనిశెట్టిబాబూరావు, పట్టణశాఖ అధ్యక్షుడు దగ్గుపల్లిసాయిబాబా, సీడీసీ మాజీ చైర్మన్ గూటూరు శ్రీను, బీసీ సెల్ కార్యదర్శి ఆడారి ప్రసాద్, ఎస్సీ సెల్ నాయకులు లంక సూరిబాబు పాల్గొన్నారు.
చంద్రబాబే పెద్ద ఆర్థిక నేరగాడు
చంద్రబాబు నాయుడు దేశంలోనే పెద్ద ఆర్థిక నేరగాడని పాయకరావుపేట వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గొల్ల బాబూరావు ఆరోపించారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు. అక్రమంగా ఎన్ని కేసులు బనాయించినా నిర్భయంగా న్యాయపోరాటం చేస్తున్న జగన్‌ను విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఓటుకు నోటు కేసులో అరెస్టు చేస్తారన్న భయంతో రాత్రికి రాత్రి తట్టా బుట్టా సర్దుకుని హైదరాబాద్ నుంచి పారిపోయి రాలేదని ఎద్దేవా చేశారు.
పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన నిధుల లెక్కలు చెప్పాలని బీజేపీ డిమాండ్‌తో రక్షించాలని వివిధ పార్టీల నాయకులను ప్రాధేయపడడం అందరికీ తెలిసిందే అన్నారు. నియోజకవర్గంలో నాలుగుసార్లు పర్యటించినప్పుడు ఇచ్చిన డిగ్రీ, జూనియర్ కళాశాలలు ఏర్పాటు, ఆస్పత్రి çఅప్‌గ్రేడ్ వంటి హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని నియోజకవర్గానికి వచ్చావన్నారు. మోసపోయి ఓట్లేయడానికి రాష్ట్ర ప్రజలు తెలివి తక్కువ వారు కాదన్నారు.
సినీ నటుల ప్రచారం.. మండలంలోని పాల్తేరు గ్రామంలో సినీ నటులు పృధ్వీరాజ్, జోగినాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు మాయమాటలకు మోసపోవద్దన్నారు ఆయన పెట్టే పథకాలన్ని ఓట్లకోసమేనన్నారు. మరో సారి మోసపోతే నట్టేట ముంచేస్తాడన్నారు. జనరంజకమైన పాలన అందించే సత్తా జగన్‌మోహన్‌రెడ్డికే ఉందన్నారు. నవరత్నాలు, బీసీ డిక్లరేషన్ వంటి పథకాలు దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ప్రకటించలేదన్నారు. ఈ ప్రచారంలో జెడ్పీ ఫ్లోర్‌లీడర్ చిక్కాల రామారావు, డి. వెంకటేశ్వరరావు, అనిశెట్టి వెంకటసూరి పాల్గొన్నారు.
ఉద్దండపురంలో ఇంటింట ప్రచారం
నక్కపల్లి: మండలంలోని ఉద్దండపురంలో మండలశాఖ «అధ్యక్షుడు పొడగట్లపాపారావు ఆధ్వర్యంలో కార్యకర్తలు సోమవారం రాత్రి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థి గొల్ల బాబూరావు, ఎంపీ అభ్యర్థి డాక్టర్ సత్యవతిలను గెలిపించాలన్నారు. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు, చేసే వాగ్దానాలకు మోసపోవద్దన్నారు. ప్రకటించిన నవరత్నాలు, బీసీ డిక్లరేషన్ అమలు కావాలంటే జగనన్న సీఎం కావాలన్నారు. ఈ ప్రచారంలో పార్టీనాయకులు పొడగట్ల సూరిబాబు, బచ్చలరాజు, రమణ, వెంకటేష్, రాఘవ, దొరబాబు, పొడగట్లరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment