గుంటూరు జిల్లాలో ఎన్నికలు వాయిదా పడిన 12 పంచాయతీల్లో గురువారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నరసరావుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో 11, గుంటూరు డివిజన్‌లో ఒక పంచాయతీకి ఎన్నికలు జరిగాయి.
సాక్షి, నరసరావుపేట: గుంటూరు జిల్లాలో ఎన్నికలు వాయిదా పడిన 12 పంచాయతీల్లో గురువారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నరసరావుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో 11, గుంటూరు డివిజన్‌లో ఒక పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. గత నెల 31న జరిగిన ఎన్నికల్లో ఐదు పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సులను కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఎత్తుకెళ్లి బావిలో పడేయడంతో వాటికి తిరిగి ఎన్నికలు నిర్వహించారు.
అయితే, ఈ ఎన్నికలను కాంగ్రెస్‌పార్టీ మద్దతుదారులు బహిష్కరించారు. పల్నాడులో ఎన్నికలు జరిగిన 11 పంచాయతీల్లో రొంపిచర్ల, ఇక్కుర్రు, తూబాడు, కండ్లకుంట, ఊడిజెర్ల, గోగులపాడులలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. పెదరెడ్డిపాలెం, శిరిగిరిపాడు గ్రామాల్లో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులు, అందుగులపాడు, ముత్తనపల్లిలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. సారంగపల్లి అగ్రహారంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. గుంటూరు డివిజన్‌లోని గుంటూరు రూరల్ మండలం చల్లావారిపాలెంలో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు.