
వైఎస్ షర్మిలకు అండగా ఉంటాం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిలకు అండగా ఉంటామని ఆ పార్టీ మహిళా నాయకులు, ఎంపీలు చెప్పారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిలకు అండగా ఉంటామని ఆ పార్టీ మహిళా నాయకులు, ఎంపీలు చెప్పారు. సోషల్ మీడియాలో షర్మిలను కించపరుస్తూ దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం వైఎస్ఆర్ సీపీ ఎంపీలు బుట్టా రేణుక, కొత్తపల్లి గీత మాట్లాడారు.
మహిళలను ప్రోత్సహించాలే కానీ వారి గౌరవ మర్యాదలకు భంగం కలిగించేలా అసభ్యంగా చిత్రీకరించడం దారుణమని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మహిళల రాణించకుండా చేయడానికి కొన్ని వెబ్ సైట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ప్రజా సమస్యల కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసిన షర్మిలపై అసత్య ప్రచారం చేయడం తగదని అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. ఇలాంటి సంఘటనల్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని, మహిళలకు అండగా ఉండాలని చెప్పారు. అస్యత ప్రచారం చేస్తున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, సోమయాజులు సీపీని కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందచేశారు.