
సాక్షి, నెట్‌వర్క్: కాపు నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు రంగాకు ఘనంగా నివాళులర్పించారు. ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయి రెడ్డి, పార్టీ నేతలు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎన్.పద్మజ, ఎం.అరుణ్‌కుమార్, కొండా రాఘవరెడ్డి తదితరులు రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలోనూ రంగా వర్థంతి కార్యక్రమం జరిగింది. రంగా చిత్రపటానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు కొలుసు పార్థసారథి, వెలంపల్లి శ్రీనివాస్, పైలా సోమినాయుడు, విజయవాడ నగర కార్యనిర్వాహక అ«ధ్యక్షుడు మల్లాది విష్ణు నివాళులర్పించారు.
రంగాపై వెబ్ సిరీస్
తన తండ్రి వంగవీటి రంగా స్ఫూర్తితో ముందుకు సాగుతానని వైఎస్సార్‌సీపీ నేత వంగవీటి రాధాకృష్ణ చెప్పారు. రంగా వర్థంతి సందర్భంగా మంగళవారం విజయవాడలోని రాఘవయ్య పార్క్ వద్దనున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సినీ నటుడు జీవీ సుధాకర్ నాయుడు మాట్లాడుతూ.. రంగా జీవిత చరిత్రను ప్రజలకు తెలియజేసేందుకు త్వరలో వెబ్ సిరీస్ తీయనున్నట్లు చెప్పారు.
వైఎస్సార్‌సీపీ అమెరికా విభాగం ఆధ్వర్యంలో..
వైఎస్సార్‌సీపీ డెట్రాయిట్ విభాగం ఆధ్వర్యంలో అమెరికాలో రంగా వర్థంతి కార్యక్రమం జరిగింది. ఎన్‌ఆర్‌ఐలు దీపక్ గోపాలం, సునీల్ మందుటి, చెంచురెడ్డి, దేవనాథరెడ్డి, గోపిరెడ్డి, రవి, నరసింహారెడ్డి, శ్రీకాంత్ గాయం, నరేశ్ పూల, ధీరజ్, ప్రసాద్, లలిత్ వడ్లమూడి, వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ డాక్టర్స్ వింగ్ అధ్యక్షులు వాసుదేవరెడ్డి, నలిపిరెడ్డి తదితరులు రంగాకు ఘనంగా నివాళులర్పించారు.