జెడ్పీ చైర్‌పర్సన్ శోభాస్వాతిరాణి ఆధిపత్యానికి షాక్ తగులుతోందా? జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో జరిగిన రహస్య సమావేశమే ఆమెకు ఈ పరిస్థితి రావడానికి కారణమైందా? గూడుపుఠాణి చేసిన వారికి తన పవరేంటో చూపించాలని మంత్రి మృణాళిని భావించారా? వైస్‌చైర్మన్‌కు చాంబర్ ఏర్పాటు చేయాలని తాను ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదని పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు చిన్నబుచ్చుకుని, చేతల్లో చూపించారా? ఈ పరిణామాలన్నీ విశ్లేషిస్తే జెడ్పీ సీఈవో బదిలీ వ్యవహారమే వీటన్నిటికీ సమాధానం అనే అనుమానాలు కలుగుతున్నాయి.
సాక్షి ప్రతినిధి,విజయనగరం: బదిలీల వ్యవహారం తెరపైకొచ్చిన దగ్గరి నుంచి జెడ్పీ సీఈఓ పోస్టు కోసం ఎవరికి వారు ప్రయత్నించినా చివరికీ ఇద్దరికే జిల్లా నేతల ఆశీస్సులందాయి. గతంలో ఇక్కడ సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేసిన రమణమూర్తిని తీసుకొచ్చేందుకు జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి పావులు కదిపారు. ఆమేరకు సిఫారసు లేఖ కూడా ఇచ్చారు. అయితే, తన కుమార్తె వివాహం అయ్యేంతవరకు ఇక్కడే ఉంచాలని కోరుతూ ప్రస్తుత సీఈఓ ఎన్.మోహనరావు అభ్యర్థించడంతో చైర్‌పర్సన్ మనసు మార్చుకుని మోహనరావును కొనసాగించాలని పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు దృష్టిలో మౌఖికంగా పెట్టారు. అటు మంత్రి మృ ణాళిని ఆశీస్సులుండాలని ఆమె వద్దకు కూడా మోహనరావు వెళ్లి సిఫారసు లేఖను తీసుకున్నారు.
కనీసం ఏడాది పాటు తననే కొనసాగిస్తారని మోహనరావు గట్టి ధీమాతో ఉన్నారు. అయితే ఊహించని విధంగా గతంలో విజయనగరం ఆర్డీవోగా పనిచేస్తూ బదిలీపై వెళ్లిన గనియా రాజకుమారిని జెడ్పీ సీఈఓగా నియమిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అటు జెడ్పీ చైర్‌పర్సన్, ఇటు గంపెడాశలు పెట్టుకున్న మోహనరావుకు విస్తుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవల జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో జరిగిన రహస్య సమావేశంలో చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి పాల్గొని అసమ్మతి స్వరం విన్పించారన్న విషయం తెలుసుకుని మంత్రి మృణాళిని ఆమెపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఇంకా ఊరుకోవడం మంచిది కాదని తనదైన శైలిలో నాటి నుంచి ఆమె పావులు కదుపుతున్నట్టు పార్టీ వర్గాల్లో విన్పిస్తోంది.
జెడ్పీలో తన హవా కొనసాగితే చైర్‌పర్సన్ దారికొస్తారని, అందుకు కీలకమైన సీఈఓ పోస్టులో అనుకూల వ్యక్తిని నియమించుకోవాలన్న ఉద్దేశానికి వచ్చారని, అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన గనియా రాజకుమారిని సిఫారసు చేసి యుద్ధప్రాతిపదికన పోస్టింగ్ వేయించినట్టు వాదనలు విన్పిస్తున్నాయి. దీనితో పాటు మరో వాదన కూడా విన్పిస్తోంది. జెడ్పీ చైర్‌పర్సన్‌కు తొలి నుంచి అసమ్మతి వాదులగా ఉన్న ఓ ముగ్గురు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. తొలి నాళ్లలో పంచాయతీరాజ్ డీఈఈ శ్రీనివాస్ విషయంలో హల్‌చల్ చేసి చైర్‌పర్సన్ స్వాతిరాణి వర్గీయుల్ని ముచ్చెమటలు పట్టించిన ఆ ఏమ్మెల్యేలు పథకం ప్రకారం మరో ఎత్తుగడ వేశారన్న వాదనలు ఉన్నాయి.పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఇందులో కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది.
తనకున్న భవిష్యత్ ముప్పును దృష్టిలో ఉంచుకుని చైర్‌పర్సన్ వర్గీయులకు చెక్‌పెట్టేందుకు గాను ైవైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తిని తెరముందుకు తీసుకొచ్చి,జెడ్పీలో ఆయనకొక చాంబర్ ఏర్పాటు చేసి, తద్వారా మరో పవర్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని పథక రచన చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మంత్రి అయ్యన్నపాత్రుడి ద్వారా వైస్ చైర్మన్‌కు ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేయాలని చైర్‌పర్సన్‌కు చెప్పించినట్టు సమాచారం. ఆ క్రమంలోనే అయ్యన్న పాత్రుడు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆ ఆదేశాలను జెడ్పీలో అమలు చేయలేదనే విషయాన్ని సదరు ఎమ్మెల్యేలు మంత్రి అయ్యన్న చెవిలో వేసినట్టు తెలుస్తోంది. పొరుగు జిల్లాల సీఈఓలను సదరు జెడ్పీ చైర్మన్‌ల సిఫారసు మేరకు కదపకపోగా, ఈ జిల్లా చైర్‌పర్సన్ సూచించిన వారిని కాకుండా, ఆమెకు కనీసం సమాచారం ఇవ్వకుండా మంత్రి అయ్యన్న తనకు నచ్చిన వ్యక్తికి జెడ్పీ సీఈఓగా పోస్టింగ్ కల్పించి ఉండొచ్చని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏదేమైనప్పటికీ చైర్‌పర్సన్ స్వాతిరాణి ఆలోచనలు, అభిప్రాయాలకు భిన్నంగా సీఈఓ నియామకం జరగడంతో ఆ వర్గం తట్టుకోలేకపోతోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాటి మంత్రి బొత్స ఆశీస్సులతో కీలక పోస్టింగ్‌లు దక్కించుకున్న రాజకుమారిని మళ్లీ జెడ్పీ సీఈఓగా నియమించారంటూ పార్టీ వర్గాలు కూడా పెదవి విరుస్తున్నాయి.
శోభకు షాక్
Published Mon, Nov 10 2014 1:48 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement
Advertisement