మనీస్తాపం
- డబ్బెలా సంపాదించాలబ్బా
- బుర్ర బాదుకుంటున్న జెడ్పీటీసీలు
- ఎన్నికల్లో విపరీతంగా వ్యయం
- జెడ్పీలో నిధులకు తీవ్ర కొరత
విశాఖ రూరల్: జెడ్పీ ఎన్నికల్లో విజయం కోసం డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేశారు. గెలిచాక రెట్టింపు రాబట్టుకోవచ్చని ఆశించారు. ఒక్కొక్కరు రూ.కోటికి పైగా వెదజల్లారు. ప్రస్తుతం జెడ్పీలో నిధుల కొరతను చూసి విస్తుపోతున్నారు. ఎన్నికల ఖర్చును ఎలా రాబట్టుకోవాలో తెలియక జెడ్పీటీసీలు బుర్రలు బాదుకుంటున్నారు.
జెడ్పీ నిధులు రూ.12 కోట్లే
జెడ్పీలో ప్రస్తుతం రూ.12 కోట్లు మాత్రమే ఉన్నాయి. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.4.5 కోట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.1.5 కోట్లు, సాధారణ నిధులు రూ.5 కోట్లు ఇటీవల విడుదలయ్యాయి. వీటితో పాటు తలసరి నిధుల కింద మరో రూ.కోటి వరకు వ చ్చింది. ఇంతకు మించి జెడ్పీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు వచ్చే అవకాశాల్లేవు. వీటిలో రూ.కోటిని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా కోసం వినియోగిస్తున్నారు.
పదవీ విరమణ పొందిన జెడ్పీ ఉద్యోగులు, సిబ్బంది పింఛన్లకు ఏటా సుమారు రూ.4 కోట్లు చెల్లించాలి. ఉద్యోగుల జీతభత్యాలకు రూ.3 కోట్లు అవుతోంది. ఇంక మిగిలేది కేవలం రూ.4 కోట్లు మాత్రమే. జెడ్పీకి ఇంతకన్నా ఆదాయం రాకపోవడంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అసాధ్యమని అధికారులే చెబుతున్నారు. వాస్తవానికి జెడ్పీకి స్టాంపు డ్యూటీ, ఇసుక వేలం (25 శాతం) సీనరేజ్ గ్రాంట్, ల్యాండ్ సెస్, టెండర్ షెడ్యూల్ 4 శాతం తలసరి గ్రాంట్ సక్రమంగా రాకపోవడంతో ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఇసుక వేలం లేకపోవడంతో ఆదాయం తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో జిల్లా పరిషత్ నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల అమలు కొత్త పాలక వర్గానికి కత్తి మీద సాముగా మారింది.
అభివృద్ధి పనులకే సరిపోవు
జిల్లా పరిషత్ బడ్జెట్‌ను తెలుసుకుంటున్న జెడ్పీటీసీ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బు ఏ విధంగా సంపాదించాలో తెలియక సతమతమవుతున్నారు. జిల్లా పరిషత్ అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించే నిధుల నుంచి కమీషన్లు ద్వారా డబ్బులు రాబట్టుకోవాలనుకున్నా అంత స్థాయిలో అవకాశం లేదు. అభివృద్ధి పనులకే నిధులు లేకుండా ఉన్నాయి. కనీసం వారి మండల పరిధిలో ఇతర శాఖల ద్వారా జరిగే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల నుంచి సంపాదించాలంటే ఎమ్మెల్యేలు వారికి అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
గతంలో ఇలాంటి పంపకాలు, కమీషన్ల వ్యవహారంలోనే ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ మధ్య తీవ్ర స్థాయిలోనే తగాదాలు జరిగాయి. ఎమ్మెల్యేలు కూడా ఎన్నికల్లో రూ.కోట్లలో ఖర్చు చేయడంతో వారు కూడా ఈ అభివృద్ధి పనులకు వెచ్చించే నిధుల నుంచే తమ వాటాలు పొందాలని గట్టి నిర్ణయంతో ఉన్నారు. దీంతో ఈసారి కూడా జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేల మధ్య వివాదాలు తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ ఎమ్మెల్యే పెత్తనం అధికంగా ఉంటే తమకు పైసా కూడా రాదని జెడ్పీటీసీలు మదనపడుతున్నారు.