Best Retirement Plans | Details Inside | Sakshi Business News - Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్‌ తర్వాత ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ ఉందా? రిస్కు అయినా ఓకేనా?

Published Mon, Aug 2 2021 12:16 AM | Last Updated on Mon, Aug 2 2021 3:51 PM

Every Family Needs A Retirement Plan - Sakshi

ప్రతీ కుటుంబానికి రిటైర్మెంట్‌ ప్రణాళిక అవసరం ఎంతో ఉంది. కానీ, చాలా మందికి విశ్రాంత జీవనానికి సంబంధించిన ప్రణాళిక ప్రాధాన్య అంశంగా ఉండకపోవడాన్ని గమనించొచ్చు. వృద్ధాప్యంలో మెరుగైన జీవనం కోసం ఆర్థిక ప్రణాళికను తప్పనిసరిగా ఆచరణలో పెట్టాలి. ప్రతి నెలా తమ ఆదాయం నుంచి వీలైనంత మేర రిటైర్మెంట్‌ కోసం పెట్టుబడులుగా మళ్లించుకోవాలి. 20–40 ఏళ్ల తర్వాతి అవసరాల కోసం ముందు నుంచే పొదుపు మొదలు పెడితే.. అది కొద్ది మొత్తమైనా కాంపౌండింగ్‌ ప్రయోజనంతో భారీగానే సమకూర్చుకోవచ్చు. అందుకే ఎంత ముందుగా ప్రారంభిస్తే లక్ష్యం అంత తేలిక అవుతుంది. భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు ఈక్విటీలను మించిన మెరుగైన సాధనం వేరొకటి లేదు. ఇతర సాధనాలతో పోలిస్తే రిటైర్మెంట్‌ కోసం.. ఈక్విటీ, డెట్‌ కలయికతో కూడిన హైబ్రిడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం వల్ల రిస్క్‌ను తగ్గించుకుని మెరుగైన రాబడులను సమకూర్చుకునేందుకు అవకాశం ఉంది. రిటైర్మెంట్‌ నిధి కోసం అందుబాటులోని మెరుగైన ఫండ్స్‌పై సమగ్ర వివరాలను అందిస్తున్న ‘ప్రాఫిట్‌ ప్లస్‌’ కథనమే ఇది..

మ్యూచువల్‌ ఫండ్స్‌లోనూ రిటైర్మెంట్‌ కోసం ఉద్దేశించిన ఫండ్స్‌ కొన్ని ఉన్నాయి. తొమ్మిది అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల (ఏఎంసీ/మ్యూచువల్‌ ఫండ్స్‌) పరిధిలో సుమారు 25 పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ డెట్, ఈక్విటీ పెట్టుబడులతో కలసినవే. ఇందులో సగం మేర అగ్రెస్సివ్‌ ఫండ్స్‌. అంటే ఈక్విటీకి ఎక్కువ కేటాయింపులు చేసేవి. సుమారు 65–80 శాతం వరకు ఈక్విటీలకు, మిగిలిన మేర డెట్‌ సాధనాలకు కేటాయిస్తుంటాయి. మిగిలిన ఫండ్స్‌ కన్జర్వేటివ్‌ విధానంలో పనిచేసేవి. అంటే అగ్రెస్సివ్‌ ఫండ్స్‌కు విరుద్ధంగా 60–70 శాతం వరకు డెట్‌ సాధనాలకు, మిగిలిన మేర ఈక్విటీలకు కేటాయించే పథకాలు. సాధారణంగా రిటైర్మెంట్‌ కోసం 30 ఏళ్ల సమయం అయినా ఉంటుంది కనుక.. దీర్ఘకాలంలో ఈక్విటీ పెట్టుబడులపై రిస్క్‌ చాలా నామమాత్రమేనని చరిత్ర చెబుతోంది.

రిస్క్‌ తీసుకునే వారు అగ్రెస్సివ్‌ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. కన్జర్వేటివ్‌ ఫండ్స్‌ అన్నవి రిస్క్‌ సరిపడని వారి కోసం ఉద్దేశించినవి. అంటే రిటైర్మెంట్‌ కోసం కొంత తక్కువ వ్యవధి ఉన్న వారు వీటిని పరిశీలించొచ్చు. ఇతర మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలతో పోలిస్తే రిటైర్మెంట్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు ఐదేళ్ల పాటు లాకిన్‌ ఉంటుంది. లేదా రిటైర్మెంట్‌ ఈ రెండింటిలో ఏది ముందు అయితే అది లాకిన్‌గా అమలవుతుంది. రిటైర్మెంట్‌ గడువు కంటే ముందుగానే పెట్టుడులను వెనక్కి తీసుకుంటే ఎగ్జిట్‌ లోడ్‌ చెల్లించుకోవాలి. ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ మాదిరే రిటైర్మెంట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో చేసే పెట్టబడులకూ సెక్షన్‌ 80సీ కింద పన్ను ఆదా ప్రయోజనం లభిస్తుంది. సెక్షన్‌ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల పెట్టుబడులపై పన్ను లేకుండా మినహాయింపు పొందొచ్చు. అయితే అందుబాటులోని 25 రిటైర్మెంట్‌ ఫండ్స్‌లో దీర్ఘకాల చరిత్ర ఉన్నవి కొన్నే.

ఐదేళ్లకు పైగా ఉన్న పథకాలు పది వరకు (ఐదు అగ్రెస్సివ్, ఐదు కన్జర్వేటివ్‌) ఉన్నాయి. మిగిలిన పథకాలకు రెండున్నరేళ్లకు మించి చరిత్ర లేదు. కనుక కాస్త ఎక్కువ చరిత్ర ఉన్న పథకాల్లో టాటా రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ ఫండ్‌ ప్రోగ్రెస్సివ్‌ ప్లాన్, టాటా రిటైర్మెంట్‌ కన్జర్వేటివ్‌ ప్లాన్‌ ఆయా విభాగాల్లో మంచి రాబడుల చరిత్రతో నడుస్తున్నాయి. అగ్రెస్సివ్‌ హైబ్రిడ్, కన్జర్వేటివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌లోని ఇతర పథకాలతో పోల్చి చూసినా వీటి రాబడులు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి. గత ఏడేళ్ల చరిత్రను పరిశీలించి చూస్తే ఎన్నో హైబ్రిడ్‌ ఫండ్స్‌ కంటే టాటా రిటైర్మెంట్‌ ఫండ్స్‌ పనితీరు మెరుగ్గా కనిపిస్తుంది. రిటైర్మెంట్‌ ఫండ్స్‌లో మంచి రాబడుల చరిత్ర కలిగిన వాటిల్లో క్రమానుగత పెట్టుబడుల విధానంలో (సిప్‌) ఇన్వెస్ట్‌ చేసుకోవడం ద్వారా మంచి నిధిని సమకూర్చుకునేందుకు అవకాశం ఉంటుంది.

టాటా రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ ఫండ్‌
టాటా రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ ఫండ్‌కు పదేళ్ల చరిత్ర ఉంది. ప్రోగ్రెస్సివ్, మోడరేట్, కన్జర్వేటివ్‌ రూపంలో మూడు ప్లాన్లు ఈ ఫండ్‌లో అందుబాటులో ఉన్నాయి. అంటే ఇన్వెస్టర్‌ తమ రిస్క్‌ తీసుకునే సామర్థ్యం, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా వీటిల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. ప్రోగ్రెస్సివ్‌ ప్లాన్‌ ఈక్విటీలకు గరిష్టంగా 85 శాతం నుంచి 100 శాతం వరకు పెట్టుబడులను కేటాయించే స్వేచ్ఛను కలిగి ఉంటుంది. అదే మోడరేట్‌ప్లాన్‌ అయితే 65–85 శాతం మధ్య ఈక్విటీ పెట్టుబడులను నిర్వహిస్తుంది. కన్జర్వేటివ్‌ ప్లాన్‌ 70 శాతం నుంచి 100 శాతం మధ్య డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఈ ప్లాన్లు ఈక్విటీ, డెట్‌ మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఆయా విభాగాల్లో గరిష్ట పరిమితుల మేరకు పెట్టుబడులను కలిగి ఉంటుంటాయి.

అంతేకానీ ఒకే విభాగంలో నూరు శాతం పెట్టుబడులు పెట్టడం అన్నది దాదాపుగా అరుదనే చెప్పుకోవాలి. ఈక్విటీలకు ఎక్కువ కేటాయింపులు చేసే టాటా రిటైర్మెంట్‌ ప్రోగ్రెస్సివ్‌ ప్లాన్‌ సగటున మంచి రాబడులను అందిస్తోంది. రోలింగ్‌ రాబడులను పరిశీలిస్తే మూడేళ్లలో వార్షికంగా సగటున 9.1 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 15.3 శాతం చొప్పున రాబడులను ఇచ్చింది. కానీ ఇదే తరహా ఇతర రిటైర్మెంట్‌ పథకాల్లో రాబడులు మూడేళ్లలో వార్షికంగా 7.2 శాతం, ఐదేళ్లలో 13.8 శాతం చొప్పునే ఉన్నాయి. మార్కెట్ల కరెక్షన్లలో నష్టాలను కూడా మైనస్‌ 1.5 శాతానికే పరిమితం కావడాన్ని కూడా ఆకర్షణీయంగానే చూడాలి.

2017 మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ ర్యాలీ సమయంలో ఈ పథకం 20–25 శాతం మేర మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఆ తర్వాత మిడ్‌క్యాప్‌ పెట్టుబడులను తగ్గించుకుంది. 2020 మార్చిలో భారీ కరెక్షన్‌ నాటికి ఈ పథకం ఈక్విటీ పెట్టుబడుల్లో 66 శాతం లార్జ్‌క్యాప్‌లోనే ఉంది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ విభాగాలకు తక్కువ కేటాయింపులు చేసింది. బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, ఐటీ రంగాల్లో ఎక్కువ పెట్టుబడులతో మంచి రాబడులను తెచ్చిపెట్టింది. ఎక్కువ శాతం ఈక్విటీ పెట్టుబడులను లార్జ్‌క్యాప్‌లోనే కొనసాగిస్తుంటుంది. ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌తో పోల్చినా ఈ ప్లాన్‌లో రాబడులు మెరుగ్గా ఉన్నాయి.  

కన్జర్వేటివ్‌ ప్లాన్‌
డెట్‌ సాధనాలకు ఎక్కువ కేటాయింపులు చేసే ఈ పథకం.. ఈ విభాగంలోనే రాబడుల పరంగా ముందుంది. రోలింగ్‌ రిటర్నులను గమనించినట్టయితే... మూడేళ్లలో 6.8 శాతం, ఐదేళ్లలో 9.1 శాతం చొప్పున సగటు వార్షిక రాబడులను ఇచ్చింది. కానీ, ఇదే కాలాల్లో ఇతర కన్జర్వేటివ్‌ ఫండ్స్‌ సగటు రాబడులు 5.9 శాతం, 8.4 శాతం చొప్పునే ఉన్నాయి. ఏఏఏ రేటెడ్‌ డెట్‌ సాధనాలు, సౌర్వభౌమ డెట్‌ పేపర్లలోనే ఎక్కువగా ఈ పథకం పెట్టుబడులు పెడుతుంటుంది. డెట్‌ సాధనాల సగటు మెచ్యూరిటీ కాలం 3.1 ఏళ్లుగా ఉంది. ఇతర పథకాలతో పోలిస్తే ఇది తక్కువ. వడ్డీ రేట్లు భవిష్యత్తులో పెరిగే అవకాశాల నేపథ్యంలో స్వల్పకాల గడువుతో కూడిన డెట్‌ సాధనాల్లో పెట్టుబడులు కలిగిన టాటా కన్జర్వేటివ్‌ ప్లాన్‌ లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

పరాగ్‌ పారిఖ్‌ ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్‌
రిటైర్మెంట్‌కు సుదీర్ఘ సమయం ఉండి, అధిక రిస్క్‌ తీసుకునే సామర్థ్యం కలిగిన వారు పరాగ్‌ పారిఖ్‌ ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్‌ను పరిశీలించొచ్చు. అన్ని కాలాల్లోనూ ఈ విభాగంలో ఈ పథకమే మెరుగైన రాబడులను ఇచ్చింది. మూడేళ్లలో 13.3 శాతం, ఐదేళ్లలో 19.1 శాతం చొప్పున వార్షిక రాబడులు ఈ పథకంలో ఉన్నాయి. ఫ్లెక్సీక్యాప్‌ విభాగం సగటు రాబడులతో పోలిస్తే పరాగ్‌ పారిఖ్‌ ఫ్లెక్సీక్యాప్‌ పథకంలోనే రాబడులు అధికంగా ఉన్నాయి. ఫ్లెక్సీక్యాప్‌ విభాగంలో సగటు రాబడులు మూడేళ్లలో 7.3 శాతం, ఐదేళ్లలో 13.8 శాతం చొప్పునే ఉండడాన్ని గమనించొచ్చు. నిఫ్టీ 500 సూచీ మొత్తం రాబడులతో (టీఆర్‌ఐ) పోల్చినా ఈ పథకం పనితీరే మెరుగ్గా ఉంది. దేశీయంగాను, అంతర్జాతీయంగాను భవిష్యత్తులో ఎంతో విలువను తెచ్చిపెట్టే సామర్థ్యం ఉన్న కంపెనీలను గుర్తించి వాటిల్లో ఈ పథకం పెట్టుబడులను పెడుతుంటుంది. పథకం ఆరంభమైన నాటి నుంచి మార్కెట్ల నష్టాల్లో గట్టిగానే నిలబడింది. మార్కెట్లతో పోలిస్తే నష్టాలు ఈ పథకంలోనే తక్కువగా ఉన్నాయి.

మిరే అస్సెట్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ 
మోస్తరు రిస్క్‌ను తట్టుకునే వారి కోసం మిరే అస్సెట్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ పథకం అనుకూలంగా ఉంటుంది. అగ్రెస్సివ్‌ ఈక్విటీ విభాగంలో పనితీరు పరంగా మెరుగ్గా ఉంది. మూడేళ్లలో వార్షికంగా చూస్తే 9.6 శాతం కాంపౌండెడ్‌ రాబడులు ఇచ్చింది. అదే ఐదేళ్లలో వార్షిక రాబడులు 14.2 శాతం చొప్పున ఉన్నాయి. ఈ విభాగం రాబడులు 6.3 శాతం, 11.8 శాతంతో పోలిస్తే అధిక రాబడులను ఇన్వెస్టర్లకు తెచ్చిపెట్టింది. అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ కనీసం 65 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించాల్సి ఉంటుంది. గరిష్టంగా 80 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని డెట్‌కు కేటాయించుకోవాల్సి ఉంటుంది. మిరే అస్సెట్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ పథకం మాత్రం ఈక్విటీలకు గరిష్టంగా 75 శాతం మేరకే కేటాయిస్తుంటుంది. అది కూడా లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. 2020 ఏప్రిల్‌ నుంచి మార్కెట్‌ ర్యాలీ చేయడంతో ఈ పథకం లార్జ్‌క్యాప్‌లో పెట్టుబడులను 2020 డిసెంబర్‌ నాటికి ఉన్న 63 శాతం నుంచి ప్రస్తుతం 53 శాతానికి తగ్గించుకుంది. ఎప్పుడూ వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తుంటుంది. బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ రంగాలకు ఎక్కువ కేటాయింపులు చేసింది. డెట్‌లోనూ అధిక రేటింగ్‌ కలిగిన సాధనాలకే ప్రాధాన్యం ఇస్తోంది. కేవలం ఒక శాతం మేర ఏఏఏ రేటింగ్‌ కంటే దిగువ రేటింగ్‌ పేపర్లలో ఇన్వెస్ట్‌ చేసింది.

కెనరా రొబెకో కన్జర్వేటివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌ 
ఈ పథకం మూడేళ్లలో 7.6 శాతం, ఐదేళ్లలో 9.2 శాతం చొప్పున వార్షిక రాబడులను తీసుకొచ్చింది. ఈ విభాగం కంటే ఎక్కువ రాబడులు ఈ పథకంలోనే ఉన్నాయి. కన్జర్వేటివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌ విభాగంలో సగటు రాబడులు మూడేళ్లలో 5.7 శాతం, ఐదేళ్లలో 7.8 శాతం చొప్పున ఉన్నాయి. తక్కువ రిస్క్‌ కోరుకునే వారు ఈ పథకాన్ని రిటైర్మెంట్‌ అవసరాల కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. కెనరా రొబెకో డెట్‌లో 45–74 శాతం మేర గత ఐదేళ్లలో పెట్టుబడులను కొనసాగించింది. ఈక్విటీల్లో 20–25శాతం మేర పెట్టుబడులను నిర్వహిస్తోంది. డెట్‌లోనూ అధిక నాణ్యత కలిగిన పేపర్లలోనే ఎక్కువ శాతం పెట్టుబడులను పెడుతోంది. అయితే జీసెక్‌లు పోర్ట్‌ఫోలియోలో ఉన్నందున వడ్డీ రేట్ల రిస్క్‌ కొంత ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement