నిర్భయ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, న్యాయవాది మల్లెల ఉషారాణి
ఏజెన్సీ జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో ‘మహిళా సాధికారత’ఎండమావిలాటిందేనని నిర్భయ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది మల్లెల ఉషారాణి అన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించటం కేవలం చట్టాలకే పరిమితమయిందని, ఆది ఆచరణలోకి వచ్చిన, సద్వినియోగం చేసుకున్న రోజు ‘మహిళలకు’ నిజమైన పండగని అన్నారు. ‘మహిళా సాధికారత–సమానవకాశాలు’ పై ఉషారాణి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు.
–కొత్తగూడెం
ప్ర: జిల్లాలో మహిళా సాధికారత పరిస్థితి..?
జవాబు: మహిళలు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుని, ఇంటా బయట తగిన గౌరవం పొంది, సమాన హక్కులు కల్గి లింగ వివక్షత లేకుండా, గౌరవ ప్రదంగా జీవించినప్పుడు పూర్తి స్థాయిలో మహిళా సాధికారత’జరిగినట్లు. కానీ దేశంలో ఎక్కడా ఆ దాఖలాలు కనిపించటం లేదు.
ప్ర: అందుకు కారణాలు ఏమిటి?
జ: మన దేశం మొదటి నుంచి పురుషాధిక్యత గల దేశం. టెక్నాలజీ పరంగా ఎంత అభివృద్ధి చెందినా ఆ మూలాలు పోవడంలేదు. ప్రతీ మహిళ దీనిపై తనకు తాను ప్రశ్నించుకోవాలి. ముందడుగు వేయాలి. అప్పుడే సాధికారత సాధ్యమవుతుంది.
ప్ర: తీసుకోవాల్సిన చర్యలు.?
జ: ఏజెన్సీ జిల్లాగా పేరుగాంచిన భద్రాద్రి కొత్తగూడెంలో అమాయక గిరిజనులతో పాటు నిరక్షరాస్యులే అధికంగా ఉన్నారు. వారికి మహిళా చట్టాలపై ఎటువంటి అవగాహన లేదు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రతి ఒక్కరికీ చట్టం, న్యాయాలపై అవగాహన కల్పించాలి. మారుమూల గ్రామాలలో ని వారి వద్దకే న్యాయం, చట్టాలను తీసుకెళ్లాలి.
ప్ర: మహిళలకు సమానవకాశాలు..?
జ: మహిళలకు సమానవకాశాలను కొన్ని రంగాలలోనే ప్రభుత్వం కేటాయించింది. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో పూర్తి స్థాయి రిజర్వేషన్‌ను కచ్చితంగా, నిష్పక్షపాతంగా అమలు పర్చిన రోజు మహిళలకు సమానవకాశాలు లభించి పురుషులతో సమాన స్థాయిలో హోదాను పొందుతారు.
ప్ర: మహిళలపై హింస, దాడులను అరికట్టాలంటే ఏం చేయాలి?
జ: మహిళలపై లైంగిక దాడులు, హింస పెరుగుతూనే ఉన్నాయి. నెలల వయసు చిన్నారి నుంచి వృద్ధుల వరకు బాధితులుగా మిగులుతున్నారు. విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ, హింసా ప్రవృత్తి గల సినిమాలు కారణమవుతున్నాయి. వీటిపై ప్రభుత్వం నియంత్రణ చేయాలి. దాడులు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు తమ పథకాలను కోట్ల నిధులను ఖర్చు ప్రచారం చేసుకుంటున్నాయి. అంతకు మించి న్యాయం, చట్టం మహిళల చెంతకు చేరే వరకు తగిన ప్రచారం చేయాలి.
ప్ర: మీ ఆర్గనైజేషన్ ద్వారా చేసిన కార్యక్రమాలు..?
జ: ఢిల్లీలో నిర్భయ సంఘటన జరిగిన తర్వాత 2013లో ‘’నిర్భయ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్’అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాం. అప్పటి నుంచి మహిళళకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాం. మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, దాడులపై పలు చోట్ల ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లను నిర్వహించి ఇప్పటి వరకు సుమారు 80 వరకు కేసులను పరిష్కరించాం.
Comments
Please login to add a commentAdd a comment