లండన్: లిక్కర్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా నుంచి వేల కోట్ల రూపాయల బకాయిలను రాబట్టుకోలేక తంటాలు పడుతున్న భారతీయ బ్యాంకులకు కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. మాల్యాకు చెందిన ఫార్ములా వన్ రేసింగ్ టీమ్ ఫోర్స్ ఇండియా విక్రయంలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని ప్రధాన బిడ్డర్లలో ఒకటైన రష్యా ఫెర్టిలైజర్ గ్రూప్ యురాల్కలి ఆరోపించింది. గతవారంలో ఈ వేలం ప్రక్రియ పూర్తయింది. అయితే, వేలంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని.. దీనివల్ల మాల్యాకు రుణమిచ్చిన 13 భారతీయ బ్యాంకుల కన్సార్షియంకు దాదాపు 4 కోట్ల పౌండ్ల (దాదాపు రూ. 375 కోట్లు)మేర నష్టం వాటిల్లినట్లు యురాల్కలి పేర్కొంది.
ఫోర్స్ ఇండియాలో మాల్యాకు చెందిన ఆరంజ్ ఇండియా హోల్డింగ్స్‌కు 42.2 శాతం వాటా ఉంది. యూకే హైకోర్టు భారతీయ బ్యాంకులకు అనుకూలంగా మాల్యా ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఫోర్స్ ఇండియా మొత్తం వ్యాపారం, ఆస్తులు, గుడ్‌విల్‌తో కలిపి తాము 10.15–12.2 కోట్ల పౌండ్ల మధ్యలో నగదు రూపంలో చెల్లించేందుకు బిడ్ వేశామని.. కానీ, వేలం నిర్వాహకులు మాత్రం తమ బిడ్‌ను నిరాకరించి ఇంకా తక్కువ బిడ్ వేసిన వారికి కట్టబెట్టారని యురాల్కలి వివరించింది.
బిడ్డింగ్ ప్రక్రియలో అక్రమాలు, తమకు జరిగిన అన్యాయానికిగాను భారీ నష్టపరిహారం(కొన్ని కోట్ల డాలర్ల మేర) కోరుతూ లండన్ హైకోర్టులో యురాల్కలి వేలం నిర్వాహకులు ఎప్‌ఆర్‌పీ అడ్వయిజరీపై పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాలకు లోబడి... వేలంలో ఫోర్స్ ఇడియాను కెనడా బిలియనీర్ లారెన్స్ స్ట్రాల్‌కు చెందిన రేసింగ్ పాయింట్ కన్సార్షియం దక్కించుకుంది. కాగా, బిడ్డింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, సజావుగా పూర్తయిందని ఎఫ్‌ఆర్‌పీ అడ్వయిజరీ స్పష్టం చేసింది. భారతీయ బ్యాంకులకు దాదాపు రూ.9,000 కోట్ల మేర రుణాలను ఎగవేసిన మాల్యా లండన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. మాల్యాను వెనక్కి రప్పించేందుకు భారత్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment