
మిలియనర్ ఎన్ఆర్ఐల సంపద ఎంతో తెలుసా..?
గతేడాది మిలియనర్ల జాబితాలో చోటు దక్కించుకున్న 2.36 లక్షల ఎన్ఆర్ఐల(ప్రవాస భారతీయుల) సంపద ఎంతో తెలుసా..? సగటున 38.3లక్షల డాలర్ల పైమాటేనట. వెల్త్ కన్సల్టెన్సీ వెల్త్ ఇన్ సైట్ రిపోర్టు ప్రవాస భారతీయుల సంపద వివరాలు వెల్లడించింది. దాదాపు 2.84 కోట్ల ప్రవాస భారతీయుల జనాభా విదేశాల్లో ఉందని, వారిలో 2.36 లక్షల ఎన్ఆర్ఐలు మిలియనర్ జాబితాలో నిలిచారని తెలిపింది. ప్రవాస భారతీయుల మిలియనర్ల సంపదలో 56.5 శాతం షేరుతో అమెరికా మొదటిస్థానంలో ఉందని, అనంతరం యూకే 12.7 శాతంతో రెండవ స్ఘానంలో నిలిచిందని పేర్కొంది. యూఏఈ, కెనడా, హాంగ్ కాంగ్, సింగపూర్, ఇండోనేషియా, జపాన్ ల్లో ఎన్ఆర్ఐలు మిలియనర్లగా ఉన్నారని రిపోర్టు తెలిపింది.
అయితే 2015లో 915 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మిలియనర్ల సంపద, 2019 వచ్చేసరికి 1.4 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకుతుందని పేర్కొంది. బలమైన భారత ఆర్థిక వృద్ధి, రూపాయి బలహీనత అనేది ప్రవాస భారతీయులు భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి దోహదం చేస్తున్నాయని రిపోర్టు నివేదించింది. రియాల్టీ, హెల్త్ కేర్ లో ఈ పెట్టుబడులు మరింత పెరుగుతున్నాయని తెలిపింది. ఏ భారతీయులైతే, ఏడాదిలో 180 రోజులు దేశ పరిధి వెలుపల ఉంటారో వారిని పన్నుల పరంగా, ఇతర అధికారిక వ్యవహారాల్లో ప్రవాస భారతీయులుగా భారత ప్రభుత్వం గుర్తిస్తుంది.