నెట్టింట సందడిగామారిన కుబేరుల జీవనశైలి
విలాసవంతమైన కార్లు, డిజైనర్ దుస్తులు, లగ్జరీ బంగ్లాలు, విలాసవంతమై హాలి డే ట్రిప్‌లు ఇదీ సంపన్నుల జీవనశైలి గురించి తరచుగా వినిపించే మాటలు. కానీ ఈ ప్రపంచంలో అపరకుబేరుల జీవన విధానం దీనికి పూర్తిగా భిన్నమైందిగా ఉంది అంటే నమ్ముతారా? విలాస జీవితాన్ని పక్కన బెట్టి అది సాధారణంగా అతి తక్కువ ఖర్చుతోనే కాలం గడుపున్న సంపన్నుల (Millionaires) సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మరో విధంగా చెప్పాలంటే ఇది లేటెస్ట్ ట్రెండ్.. ఆసక్తికరంగా ఉంది కదూ.. పదండి వీరి గురించి తెలుసుకుందాం.
సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం పొదుపు చేయాలని ఆర్థిక నిపుణులు చెప్పేమాట. అధిక ఆదాయాన్ని ఆర్జించే వారు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. 'తక్కువ ఖర్చు’ అనే పద్దతిలో జీవనశైలిని మార్చున్నారు. పొదుపు, తక్కువ ఖర్చు దీర్ఘకాలిక భద్రతనిస్తుందని ఇది ముందస్తు పదవీ విరమణ ,ఆర్థిక స్వేచ్ఛకు గేట్‌వే అని విశ్వసిస్తున్నారు. ది ఎకానమిక్ టైమ్స్ అందించిన కథనం ప్రకారం అలాంటి వారిలో షాంగ్ సావెడ్రా,డా. రాబర్ట్ చిన్, అనీ కోలెది ముందు వరుసలో ఉన్నారు.
షాంగ్ సావేద్ర: పొదుపు ద్వారా సంపదను నిర్మించడం
39 ఏళ్ల షాంగ్ సావెడ్రా ఒక వ్యాపారవేత్త, రచయిత.ఫార్చ్యూన్ ప్రకారం తన భర్తతో కలిసి మల్టీ మిలియన్ డాలర్ల నికర విలువను సొంతం చేసుకుంది. పర్సనల్ ఫైనాన్స్ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నషాంగ్ దంపతులు లైఫ్‌స్టైల్ చూస్తే ఔరా అనాల్సిందే. లాస్ ఏంజిల్స్‌లో అద్దెకు తీసుకున్న నాలుగు పడకగదుల ఇంటిలో నివాసం. ఇప్పటికీ 16 ఏళ్ల పాత సెకండ్ హ్యాండ్ కారే వాడతారు. ఎక్కడ తక్కువకు కిరాణా సరుకులు దొరుకుతాయో అక్కడే కొటారు. అంతేకాదు పిల్లలకు సెకండ్ హ్యాండ్ దుస్తులు వాడతారు. ఫేస్‌బుక్ వేదికగా అమ్మకానికి పెట్టిన బొమ్మలే కొనిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, పిల్లల చదువు, పెట్టుబడులు, దాతృత్వ కార్యక్రమాలకు మాత్రం డబ్బు ఖర్చుపెడతారు. షాంగ్ దంపతులకు న్యూయార్క్‌లో ఆస్తులున్నాయి.
లక్షల్లో జీతం, అతితక్కువ ఖర్చు
డెంటిస్ట్ రాబర్ట్ చిన్, జెస్సికా ఫారర్ దంపతులదీ దాదాపు ఇదే స్టైల్. నెలకు లక్షల్లో జీతం. లాస్ వెగాస్‌లో అద్దె ఇంట్లో నివాసం. ఇద్దరూ కలిసి ఒక కారునే వాడతారు. నెలలో ఒకటి రెండుసార్లు తప్ప బయట ఫుడ్ తినరు. హోం ఫుడ్‌కే ప్రాధాన్యత. కిరాణా సరకులు, దుస్తులన్నీహోల్‌సేల్‌గానే కొంటారు. వారు కావాలనుకున్నప్పుడు నచ్చినట్టుగా ఓ ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తున్నారట.
కోట్ల ఆస్తి, తొడిగేదిమాత్రం సెకండ్ హ్యాండ్ దుస్తులు
రీసెర్చర్, పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్ అనీ కోలెది ఈ కోవకు చెందిన వారే. వీరి ఆస్తులు మిలియన్ డాలర్లకుపై మాటే. అయినా ఎక్కువగా సెకండ్ హ్యాండ్ దుస్తులనే వాడతారు. డబ్బును ఎలా పొదుపు చేయాలో మహిళలకు సూచనలిచ్చే ఈమె ఏడాదికి మూడుసార్లు మాత్రమే దుస్తులు కొంటారట.పైసా ఖర్చుపెట్టాలంటే ఆచితూచి వ్యవహరిస్తారు. విమాన ప్రయాణాల విషయంలో డిస్కౌంట్లు, ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటుంటారు.ఉచితంగా ఎక్కడ స్విమ్మింగ్ చేసుకొనే అవకాశం ఉంటే అక్కడికే వెళతారు. ఇలా సంపన్నుల మన్న ఆర్భాటం లేకుండా అత్యంత సాధారణమైన జీవితాన్ని సాగిస్తూ, రిటైర్మెంట్ జీవితానికి చక్కటి బాటలు వేసుకుంటున్నారు.
ఆదాయం తక్కువ, అప్పులెక్కువ అనే ధోరణితో జీవించే వారికి వీరి జీవనశైలి కనువిప్పు కావాలి. లేనిపోని ఆడంబరాలు, హంగూ ఆర్భాటాలు లేకుండా సంపాదించే ప్రతీ పైసాని సద్వినియోగం చేసుకుంటూ, భవిష్యత్తుకు బాటలు వేసే మార్గాలను ఆచరించడం ఆదర్శనీయం.
Comments
Please login to add a commentAdd a comment