అంత పన్ను వేస్తే ప్లాంట్లు మూసుకోక తప్పదు..
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానంలో సాఫ్ట్ డ్రింకులకు అత్యధికంగా 40 శాతం పన్ను పరిధిలోకి చేరిస్తే తాము భారత్‌లో కొన్ని ప్లాంట్లను మూసివేయాల్సి వస్తుందని బెవరేజెస్ సంస్థ కోకా కోలా ఇండియా పేర్కొంది. అరవింద్ సుబ్రమణ్యన్ కమిటీ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే.. మొత్తం బెవరేజిల వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడొచ్చని సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఇష్తియాఖ్ అంజాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితంగా కొన్ని ప్లాంట్లను మూసివేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు.
భారత్ తమకు కీలక మార్కెట్లలో ఒకటని, ఇప్పటికే 2.5 బిలియన్ డాలర్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టామని, 2020 నాటికి మరో 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నామని పేర్కొన్నారు. అటు, 40 శాతం పన్ను రేటు చాలా ఎక్కువన్న మరో దిగ్గజ కంపెనీ పెప్సీకో.. పరిశ్రమ పరిస్థితులను బట్టి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోగలదని ఆశిస్తున్నట్లు తెలిపింది. పొగాకు, లగ్జరీ కార్లు తదితర ఉత్పత్తుల కేటగిరీలో ఏరేటెడ్ డ్రింక్స్‌నూ గరిష్ట పన్ను రేటు 40 శాతం విభాగంలో చేర్చాలనిఅరవింద్ సుబ్రమణ్యన్ కమిటీ పేర్కొన్న విషయం తెలిసిందే.