న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకును గాడిన పెట్టే దిశగా రూ. 9,300 కోట్ల మేర నిధులు సమకూర్చనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ వెల్లడించారు. బ్యాంకు మూలధన స్థాయిని పెంచేందుకు, లాభాల్లోకి మళ్లించేందుకు ఇది తోడ్పడగలదని పేర్కొన్నారు. ఇందులో సుమారు 51 శాతం నిధులను (రూ. 4,743 కోట్లు) ఎల్‌ఐసీ సమకూర్చనుండగా, మిగతా 49 శాతం (రూ. 4,557 కోట్లు) కేంద్రం వన్–టైమ్ ప్రాతిపదికన అందించనుంది. మొండిబాకీలతో కుదేలైన ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ గత ఆగస్టులో తన వాటాలను 51 శాతానికి పెంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అదనపు మూలధనం లభించడంతో ఐడీబీఐ బ్యాంకు సొంతంగా మరిన్ని నిధులను సేకరించుకునే సామర్థ్యం పెంచుకోగలదని, వచ్చే ఏడాదిలో రిజర్వ్ బ్యాంక్ ఆంక్షల పరిధి (పీసీఏ) నుంచి కూడా బైటికి రాగలదని భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. కేంద్రం నుంచి మూలధనం అందిన రోజునే అదే మొత్తంలో ఐడీబీఐ బ్యాంకు రీక్యాపిటజైషన్ బాండ్లు కొనుగోలు చేయనుంది.
ఈ ఏడాది చివరినాటికి అలహాబాద్ బ్యాంక్ విలీనం పూర్తి
కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి అలహాబాద్ బ్యాంక్ విలీనం పూర్తికానుందని ఇండియన్ బ్యాంక్ అంచనావేస్తోంది. ఈ అంశంపై బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పద్మజ చుండూరు మాట్లాడుతూ.. ఇరు బ్యాంకుల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సమావేశమై విలీనానికి తగిన ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉందని, త్వరలోనే ఇందుకు సంబంధించిన తొలి సమావేశం జరగనుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment