
ఎల్ అండ్ టీలో వాటా విక్రయం
ప్రభుత్వానికి 4,000 కోట్లు
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ)లో ప్రభుత్వానికి ఉన్న వాటాలో 2.5 శాతం షేర్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 4,000 కోట్లు సమకూరింది. బుధవారం ఎల్ అండ్ టీ షేరు ధర స్వల్ప పెరుగుదలతో రూ. 1,754 వద్ద ముగిసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్పెషల్ అండర్‌టేకింగ్ ఆఫ్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (ఎస్‌యూయూటీఐ)లో 6.53 శాతం ఎల్ అండ్ టీ వాటాలు ఉన్నాయి. తాజా విక్రయంతో ఎస్‌యూయూటీఐలో ప్రభుత్వం కలిగిన ఎల్ అండ్ టీ 4 శాతానికి తగ్గుతుంది.
ఈ వాటా విక్రయంతో ప్రభుత్వానికి డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ. 6,400 కోట్లు సమకూరినట్లవుతుంది. వివిధ కంపెనీల్లో వున్న మైనారిటీ వాటాలు, ప్రభుత్వ రంగ సంస్థల వ్యూహాత్మక విక్రయం వంటి వాటి ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 72,500 కోట్లు సమీకరించాలని కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఎస్‌యూయూటీఐ వద్ద దాదాపు 50 కంపెనీల వాటాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి ఐటీసీ (9.17 శాతం), యాక్సిస్ బ్యాంక్ (11.53 శాతం). ఈ ఏడాది ఫిబ్రవరిలో 2 శాతం ఐటీసీ వాటాను విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ. 6,700 కోట్లు సమీకరించింది.