
ప్రధాని చేతుల మీదుగా జూన్‌లో... వైజాగ్ స్టీల్ విస్తరణ ప్రాజెక్టు
వైజాగ్ స్టీల్ విస్తరణ ప్రాజెక్టు జాతికి అంకితం!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విస్తరణ ప్రణాళిక దాదాపు పూర్తికావచ్చింది. విస్తరించిన యూనిట్లను ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో జాతికి అంకితం చేయనున్నారు. ఈమేరకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ప్రధాని కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. అంతా అనుకున్నట్లుగా జరిగితే జూన్ చివరివారంలో ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటించే అవకాశాలున్నాయి.
స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 4 మిలియన్ టన్నుల నుంచి 6.30మిలియన్ టన్నులకు పెంచే విస్తరణ ప్రాజెక్టుకు 2010లో అప్పటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్ శంకుస్థాపన చేశారు. రూ.1,2500కోట్లతో విస్తరణ ప్రణాళిక చేపట్టారు. ఇందులో భాగంగా వైర్‌రాడ్ మిల్-2, స్పెషల్ బార్‌మిల్, స్ట్రక్చరల్ బార్‌మిల్, ఎస్‌ఎంఎస్-2, సింటర్‌ప్లాంట్-2 యూనిట్ల విస్తరణ పనులు చేపట్టారు. ఈ పనులను ఈ ఏడాది ఫిబ్రవరినాటికి పూర్తి చేయాలని ప్లాంట్ యాజమాన్యం భావించింది. కానీ గత ఏడాది అక్టోబరులో వచ్చిన హుద్‌హద్ తుపానుతో విస్తరణ పనుల్లో జాప్యం జరిగింది. ఈ పనులు ఈ నెలాఖరుకు పూర్తి కానున్నాయి. దాంతో జూన్‌లో స్టీల్‌ప్లాంట్ విస్తరణ యూనిట్లను జాతికి అంకితం చేయించాలని ప్లాంట్ యజమాన్యం భావిస్తోంది.
హిందూజా పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం కూడా....
అదే విధంగా విశాఖపట్నం శివారులోని పాలవలసలో నిర్మాణం పూర్తి చేసుకున్న 1,040మెగావాట్ల హిందూజా పవర్‌ప్లాంట్ ప్రారంభోత్సవానికి రావల్సిందిగా ఆ సంస్థ యాజమాన్యం ప్రధాని మోదీని ఆహ్వానిస్తోంది. విశాఖ జిల్లాలో యూనిట్ నిర్మిస్తున్న మరో కార్పొరేట్ సంస్థ కూడా ప్రధాని కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతోంది. స్టీల్‌ప్లాంట్ విస్తరణ యూనిట్లను జాతికి అంకితం చేసే కార్యక్రమంతోపాటు ఆ రెండు సంస్థల కార్యక్రమాల్లో కూడా ప్రధాని మోదీ పాల్గొనే అవకాశాలున్నాయి. దీనిపై ప్రధాని కార్యాలయం అధికారికంగా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
విశాఖ ఉక్కుకు ఇనుప గనులు కేటాయించాలి
పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సులు
న్యూఢిల్లీ: ఉక్కు తయారీ దిగ్గజం వైజాగ్ స్టీల్ (ఆర్‌ఐఎన్‌ఎల్) సొంత అవసరాల కోసం ముడి ఇనుము బ్లాక్‌లను కేటాయించాలని బొగ్గు, ఉక్కుపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్రానికి సిఫార్సు చేసింది. వైజాగ్ స్టీల్ అదనంగా 20 మిలియన్ టన్నుల మేర ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఇది అత్యంత అవసరమని స్పష్టం చేసింది. ముడి సరుకు సరఫరా భద్రత లేకపోవడం వల్లే కంపెనీ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించలేకపోతోందని కమిటీ తెలిపింది.
ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థల్లో సొంతంగా ముడి ఇనుము గనులు లేని ఏకైక కంపెనీ ఇదేనని తెలిపింది. ఒకవైపు మిగతా ఉక్కు కంపెనీలు ముడి సరుకులపై 31-44 శాతమే వెచ్చిస్తుంటే, సొంత గనులు లేకపోవడం వల్ల వైజాగ్ స్టీల్ ఏకంగా 60 శాతం వెచ్చించాల్సి వస్తోందని స్థాయీ సంఘం తెలిపింది. మరోవైపు, ప్రభుత్వ రంగ కన్సల్టెన్సీ సంస్థ మెకాన్ లాభాలు గణనీయంగా పడిపోయినా పరిస్థితి మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉక్కు శాఖ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.