
ఎయిర్ టెల్ లాభం 22% డౌన్
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి 22 శాతం తగ్గింది. వడ్డీ వ్యయాలు అధికంగా ఉండడం, నెట్‌వర్క్ అప్‌గ్రెడేషన్ చార్జీలు, కొన్ని దేశాల్లో పునర్వ్యస్థీకరణ కార్యకలాపాల కారణంగా వల్ల నికర లాభం తగ్గిందని భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది.
గత క్యూ3లో రూ.1,436 కోట్లుగా ఉన్న నికర లాభం 22 శాతం తగ్గి ఈ క్యూ3లో రూ.1,117 కోట్లకు పడిపోయిందని భారతీ ఎయిర్‌టెల్ ఎండీ, సీఈఓ(ఇండియా, సౌత్ ఏషియా) గోపాల్ విట్టల్ చెప్పారు. నెట్‌వర్క్ అప్‌గ్రెడేషన్ కోసం రూ.115 కోట్లు, వివిధ దేశాల్లో పునర్వ్యస్థీకరణ కార్యకలాపాల కోసం రూ.231 కోట్లు వెచ్చించామని, నికర వడ్డీ వ్యయాలు రూ.1,360 కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు.
మొత్తం ఆదా యం రూ.23,217 కోట్ల నుంచి 4 శాతం వృద్ధితో రూ.24,066 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. వడ్డీ, పన్నుకు ముందు ఆదాయం 8 శాతం వృద్ధితో రూ.8,475 కోట్లకు పెరిగిందని తెలియజేశారు.
మొబైల్ డేటా ఆదాయం (కన్సాలిడేటెడ్) 44 శాతం వృద్ధితో రూ.4,135 కోట్లకు పెరిగిందని మిట్టల్ చెప్పారు. భారత్‌లో డేటా వినియోగదారుల సంఖ్య 30 శాతం, ట్రాఫిక్ 73 శాతం పెరగడంతో మొబైల్ డేటా ఆదాయం 51 శాతం వృద్ధితో రూ.3,184 కోట్లకు పెరిగిందన్నారు.
గత క్యూ3లో 16 శాతంగా ఉన్న మొత్తం ఆదాయంలో డేటా ఆదాయం వాటా... ఈ క్యూ3లో 23 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. 3జీ, 4జీ సర్వీసుల కారణంగా డేటా వినియోగం వృద్ధి 73 శాతం, డేటా విభాగం నుంచి ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు రాబడి(ఏఆర్‌పీయూ) రూ.200కు పెరిగాయని తెలిపారు.
అలాగే వాయిస్ కాల్స్ ఏఆర్‌పీయూ రూ.137కు తగ్గిందని, 2014 డిసెంబర్ నాటికి రూ.70,777 కోట్లుగా ఉన్న నికర రుణ భారం గత ఏడాది డిసెంబర్ నాటికి రూ.78,816 కోట్లకు పెరిగిందని చెప్పారు.