భారత్‌లోకి యాపిల్ ‘రెడ్’ ఐఫోన్7, 7ప్లస్
ధరలు రూ.82,000 నుంచి..
న్యూఢిల్లీ: అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ భారత్‌లో వచ్చే నెల నుంచి స్పెషల్ ‘రెడ్’ ఎడిషన్ ఐ ఫోన్7, ఐఫోన్ 7 ప్లస్‌లను విక్రయించనుంది. ఎరుపు రంగులోని ఈ రెండు ఫోన్‌లు 128 జీబీ, 256 జీబీ మోడల్స్‌లో లభ్యమవుతాయి. వీటి ధరలు రూ.82,000 నుంచి ప్రారంభమవుతాయి. ఎయిడ్స్ వ్యతిరేక పోరాటానికి ప్రతీకగా ఈ ఫోన్లను అందిస్తున్నామని యాపిల్ కంపెనీ పేర్కొంది. ఎయిడ్స్ బారిన పడిన వ్యక్తులకు ఔషధ, ఇతరత్రా సహాయ సహకారాలను రెడ్ సంస్థ అందిస్తోంది.
ఈ సంస్థ భాగస్వామ్యంతో ఎయిడ్స్‌కు సంబంధించిన గ్లోబల్ ఫండ్‌కు యాపిల్ కంపెనీ 13 కోట్ల డాలర్లకు పైగా విరాళాలందిస్తోంది. రెడ్ సంస్థతో పదేళ్ల భాగస్వామ్యాన్ని పురస్కరించుకొని ఈ స్పెషల్ ఎడిషన్ రెడ్ ఐఫోన్‌లను అందుబాటులోకి తెస్తున్నామని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పేర్కొన్నారు. ఎరుపు రంగు అల్యూమినియం ఫినిష్‌తో ఈ ఫోన్లను అందిస్తున్నామని వివరించారు. కాగా, కొత్త ఐపాడ్‌ను కూడా యాపిల్ కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. 9.7 అంగుళాల డిస్‌ప్లే ఉన్న ఈ ఐపాడ్ ధర రూ.28,900.