
ముంబై: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ (ఏఐ) రంగాన్ని నిపుణుల కొరత వేధిస్తోంది. మధ్య, సీనియర్ స్థాయిలో నిపుణుల కొరత మరీ అధికంగా ఉండటంతో ఈ స్థాయి పోస్టులు దాదాపు 4,000 వరకూ ఖాళీగానే ఉన్నట్లు ఒక సర్వేలో వెల్లడయ్యింది. గడిచిన ఏడాదికాలంలో ఈ పరిశ్రమ 30 శాతం వృద్ధి చెంది 230 మిలియన్ డాలర్లకు చేరినప్పటికీ.. నిపుణుల లేమి మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్, ఆన్‌లైన్ విద్యా సంస్థ గ్రేట్ లెర్నింగ్‌లు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. గత 12 నెలలుగా పోస్టుల ఖాళీ అలానే కొనసాగుతున్నట్లు సర్వే సంస్థలు తెలిపాయి. ఈ పరిశ్రమ కనీసం ఐదేళ్ల అనుభవం కలిగిన వారి కోసం చూస్తుండగా.. మూడేళ్ల అనుభవం కలిగిన వారు మాత్రమే ప్రస్తుతం దేశీయంగా అందుబాటులో ఉన్నట్లు సర్వేలో పాల్గొన్న 57 శాతం సంస్థలు వెల్లడించాయి.
ఏఐపై పెరుగుతున్న ఆసక్తి..
సప్లై–డిమాండ్‌కి మధ్య భారీ అంతరం ఉన్న కారణంగా ఇతర రంగాలకు చెందిన నిపుణులు కృత్రిమ మేధ వైపు మళ్లుతున్నారు. ముఖ్యంగా ఐటీ, ఫైనా న్స్, హెల్త్ కేర్, ఈ–కామర్స్ రంగాలకు చెందిన ఇంజి నీర్లు ఏఐ వైపు చూస్తున్నారు. వచ్చే కొద్దికాలంలోనే ఈ తరహా మార్పులు మరీ ఎక్కువగా ఉండనున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇక సంస్థలు ఎటువంటి వారిని ఎక్కువగా చూస్తున్నాయన్న విషయానికొస్తే.. మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, న్యూరల్ నెట్‌వర్క్, అనలిటిక్స్, పాట్రన్ రికగ్నిషన్‌లకు అధిక ప్రాధాన్యం ఉంది.
ప్రారంభ జీతం రూ.6 లక్షలు
దాదాపు 40 శాతం కృత్రిమ మేధ వృత్తి నిపుణులు ప్రారంభస్థాయిలోనే ఉన్నారు. వీరి సగటు వార్షిక వేతనం రూ.6 లక్షలుగా ఉంది. మధ్య, సీనియర్ స్థాయిలో 4 శాతం ఉద్యోగులు మాత్రం ఏకంగా రూ.50 లక్షల జీతం అందుకుంటూ ఈ పరిశ్రమలోని డిమాండ్‌ను ప్రతిబింబిస్తున్నారు. మధ్య స్థాయి సగటు జీతం రూ.14.3 లక్షలు. నగరాల పరంగా ముంబైలోని సంస్థలు అత్యధికంగా రూ.15.6 లక్షల సగటు జీతాన్ని ఇస్తుండగా.. ఆ తరువాత స్థానంలో బెంగళూరు ఉంది. ఈ నగర సంస్థలు రూ.14.5 లక్షలు చెల్లిస్తుండగా.. చెన్నై కంపెనీలు అతి తక్కువగా రూ.10.4 లక్షల సగటు వార్షిక జీతాన్ని చెల్లిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment