సాక్షి, న్యూఢిల్లీ: కృత్రిమ మేథ(ఏఐ)తో ఉద్యోగాలు ఊడిపోతాయనే ఆందోళనల నేపథ్యంలో దీనిపై భయాలు అవసరం లేదని పరిశోధక సంస్థ గార్ట్‌నర్ భరోసా ఇచ్చింది. ఏఐ రాకతో కోల్పోయే ఉద్యోగాల కంటే దాంతో వచ్చే ఉపాధి అవకాశాలే అధికంగా ఉంటాయని గార్ట్‌నర్ అంచనా వేసింది. కృత్రిమ మేథ కారణంగా 2020 నాటికి 18 లక్షల ఉద్యోగాలు కోల్పోనుండగా, అప్పటికి 23 లక్షల కొత్త ఉద్యోగాలు ముందుకొస్తాయని తెలిపింది.
ఏఐ ఆధారిత ఉపాధి ముఖచిత్రంలో 2020 కీలక సంవత్సరంగా గార్ట్‌నర్ అభివర్ణించింది. మొత్తంమీద ఏఐ వల్ల పెద్ద ఎత్తున కొత్త ఉద్యోగాలు ఉనికిలోకి వస్తాయని ఈ సంస్థ అంచనా వేసింది. రాబోయే సంవత్సరాల్లో ఆరోగ్యం, ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా రంగాల్లో ఉద్యోగాల డిమాండ్ పెరుగుతుందని, తయారీ రంగంలో మాత్రం ఉపాధి తగ్గుముఖం పడుతుందని పేర్కొంది. 2020 నుంచి ఏఐతో ఉద్యోగాల సృష్టి సానుకూలంగా సాగుతుందని, 2025 నాటికి 20 లక్షల కొత్త ఉద్యోగాలు నికరంగా అందుబాటులోకి వస్తాయని గార్ట్‌నర్ నివేదిక స్పష్టం చేసింది.
గతంలోనూ వినూత్న ఆవిష్కరణల ఫలితంగా మొదట్లో తాత్కాలికంగా ఉద్యోగాల కోత ఎదురైనా ఆ తర్వాత సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొంది. ఏఐ ఫలితంగా లక్షలాది అత్యున్నత నైపుణ్యాలు కలిగిన నూతన నిపుణుల అవసరం నెలకొంటుందని, ప్రారంభ, తక్కువ నైపుణ్యాలున్నా ఉద్యోగాల్లోనూ మెరుగైన వేతనంతో కూడిన ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని గార్ట్‌నర్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ స్వెత్లానా సికులర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment