
సాక్షి,న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి భారీ ఆఫర్ ప్రకటించింది. రానున్న క్రిస్మస్ , న్యూ ఇయర్ సందర‍్భంగా లగ్జరీ కార్‌లవర్స్‌కోసం తీపి కబురు అందించింది. ఎంపిక చేసిన మోడళ్లపై దాదాపు మూడు నుంచి రూ.8.85 లక్షల వరకు ధరలు తగ్గించినట్లు ఆడి ప్రకటించింది. లిమిటెడ్ ఆఫర్‌గా ప్రకటించిన ఈ "ప్రత్యేక ధరల"తో పాటు సులభమైన ఈఎంఐ ఆప్షన్స్‌ను కూడా అందిస్తోంది.దీంతోపాటు మరో బంపర్ ఆఫర్‌కూడా ఉంది. 2017లో ఫేవరేట్ ఆడి కారును కొనుగోలు చేసిన కస్టమర్లు.. 2019లో చెల్లింపులు మొదలుపెట్టవచ్చని ఇది తమ కస్టమర్లకు అందిస్తున్న అదనపు ప్రయోజనమని కంపెనీ వెల్లడించింది.
అమ్మకాల డ్రైవ్లో భాగంగా ఎంపిక చేసుకున్న మోడళ్లపై ఈ తగ్గింపును అందిస్తున్నట్టు ఆడి శుక్రవారం వెల్లడించింది. క్రిస్మస్, కొత్త ఏడాది సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆడి ఏ3, ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి క్యూ3 మోడళ్లపై ఈ ప్రత్యేక ధరలు, సులభ ఈఎంఐని అందిస్తున్నట్టు ఆడి ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
ఆఫర్‌లో భాగంగా ఆడి ఏ3 ఇపుడు రూ.26.99 లక్షలకే లభ్యంకానుంది. దీని పాత ధర రూ.31.99 లక్షలు. ఇక ఆడి ఏ4 పాత ధర రూ.39.97 లక్షలు కాగా.. ప్రస్తుతం రూ.33.99 లక్షలకే అందుబాటులో ఉండనుంది. అలాగే ఆడి ఏ6 సెడాన్ ధర రూ.53.84 లక్షల నుంచి రూ.44.99 లక్షలకు, ఎస్‌యూవీ ఆడి క్యూ3 ధర రూ.33.4 లక్షల నుంచి రూ.29.99 లక్షలకు తగ్గింది.
