సాక్షి, న్యూఢిల్లీ: బ్యాంకుల్లో కోట్లాది రూపాయల రాని బాకీలు పేరుకుపోవడానికి యూపీఏ సర్కారే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. 2జీ, బొగ్గు, కామన్‌వెల్త్ గేమ్స్ కుంభకోణాల కంటే మించి ఎన్‌పీఏ స్కామ్‌కు యూపీఏ తెగబడిందని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రుణాలు ఇచ్చేలా యూపీఏ ప్రభుత్వం బ్యాంకులపై ఒత్తిడి తెచ్చిందన్నారు. పరిశ్రమ సంస్థ ఫిక్కీ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ గత యూపీఏ హయాంలో ‘ఆర్థికవేత్తలు’ మనకు ఎన్‌పీఏల సమస్యను అప్పగించారని పరోక్షంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరంలను ఉదహరించారు.
తమ ప్రభుత్వం మహిళలకు ఉచిత వంటగ్యాస్, ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతాలు, యువతకు రుణాలు, అందుబాటు గృహాల వంటి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. పరిశ్రమ సంస్థలు ఎప్పటినుంచో కోరుతున్న జీఎస్‌టీని తమ ప్రభుత్వం అమలు చేస్తోందని, వీటి లాభాలను ప్రజలకు మళ్లించేలా యాంటీ-ప్రాఫిటీరింగ్ వంటి చర్యలు చేపట్టిందని చెప్పారు.
రక్షణ, ఆర్థిక సేవలు, ఫుడ్ ప్రాసెసింగ్ సహా కీలక రంగాల్లో సమూల సంస్కరణలను ప్రవేశపెట్టామన్నారు. ప్రజల ఆకాంక్షలు,అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం తన విధానాలను రూపొందిస్తున్నదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment