బీజింగ్ : డోక్లాం ప్రతిష్టంభన నేపథ్యంలో సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్న భారత్, చైనాలు సామరస్య ధోరణి దిశగా పయనిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య జరగనున్న భేటీ నేపథ్యంలో భారత్ పట్ల డ్రాగన్ సానుకూలంగా వ్యవహరిస్తోంది. చైనా అధికార యంత్రాంగం, మీడియా మోదీ, జిన్‌పింగ్‌ల సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగేలా చొరవ తీసుకుంటోంది. మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో ఇరు దేశాలు కీలకంగా వ్యవహరించాలని దీనిపై ఇరువురు నేతలు దృష్టిసారిస్తారని పేర్కొంటోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపడుతున్న రక్షణాత్మక ధోరణులు, అమెరికా ఫస్ట్ విధానానికి వ్యతిరేకంగా భారత్ కోరుతున్న సరళీకృత ప్రపంచ ఆవిష్కరణకు బాసటగా నిలుస్తామనే సంకేతాలను చైనా పంపుతోంది. మోదీ, జిన్‌పింగ్‌ల భేటీ ఇరువురు నేతల మధ్య కీలక అవగాహనకు దారితీస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆశాభావం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు ఉమ్మడి అంశాలపై ఇరువురు నేతల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమవుతుందని చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ కిషన్ విశ్వాసం వెలిబుచ్చారు. మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య త్వరలో జరగనున్న భేటీ భారత్-చైనా సంబంధాల్లో నూతన ఒరవడికి నాంది పలుకుతుందని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment