
ముంబై : దేశీ బ్యాంకుల రుణ వితరణ రెండేళ్ల కనిష్ట స్ధాయికి పతనమైందని ఆర్బీఐ వెల్లడించిన తాజా గణాంకాలు స్పష్టం చేశాయి. సెప్టెంబరు చివరి నాటికి బ్యాంకుల రుణాల వృద్ధి దాదాపు 8.8 శాతానికి తగ్గడం గమనార్హం. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నా ఉత్పతులు, సేవల కొనుగోళ్లు ఊపందుకోలేదు. బ్యాంకుల్లో రుణ వృద్ధి పెరిగేలా, అర్హులకు రుణాలు అందించే ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారానే డిమాండ్‌ను పెంచగలమని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. బ్యాంకుల ద్వారా రుణ వితరణను పెంచేలా చొరవ చూపాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. డిమాండ్, సరఫరా పడిపోవడంతో రుణ వృద్ధి మందగించిందని కేర్ రేటింగ్స్‌లో చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ అభిప్రాయపడ్డారు.
రుణ వితరణ పెంచాలని, దేశవ్యాప్తంగా లోన్ మేళాలను నిర్వహించాలని ప్రభుత్వం సూచించినా క్రెడిట్ గ్రోత్ నిరుత్సాహకరంగానే ఉండటం గమనార్హం. ఆర్థిక వృద్ధికి కీలకమైన రిటైల్ రుణాల విషయంలో బ్యాంకులు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కస్టమర్లలో అత్యధిక డిఫాల్ట్స్‌ను సాకుగా చూపుతూ బ్యాంకులు రిటైల్ రుణాల జారీలో దూకుడు పెంచడం లేదు. మరోవైపు డిమాండ్ తగ్గుదలతో పాటు మార్కెట్‌లో లిక్విడిటీ తగినంత లేకపోవడం కూడా రుణాల జారీ ఆశించిన మేర సాగడం లేదని భావిస్తున్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించి రుణాలను చౌకగా అందించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక పండుగ సీజన్‌లో డిమాండ్ ఊపందుకోవడం ద్వారా రుణ వితరణ పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment