బిగ్ బజార్ డిస్కౌంట్ స్కీమ్
ముంబై : ఆన్ లైన్ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ నుంచి పోటీని తట్టుకోవడానికి దేశంలోనే అతిపెద్ద సూపర్ మార్కెట్ చైన్ బిగ్ బజార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రతినెలా మొదటి ఎనిమిది రోజులకు ఓ డిస్కౌంట్ స్కీమ్ ను ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిషోర్ బియానీ ప్రవేశపెట్టనున్నారు. ఆన్ లైన్ షాపింగ్ లకు తరలిపోతున్న కస్టమర్ల వలసను ఆపడానికి, కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి బిగ్ బజార్ సంస్థ ఈ డిస్కౌంట్ స్కీమ్ ను ప్రవేశపెట్టనుంది. వచ్చే నెల నుంచి ఈ కొత్త స్కీమ్ ప్రారంభంకాబోతుందని సంస్థ ప్రకటించింది. కేవలం వీకెండ్స్ లో, జీతాలు వచ్చిన కొన్నిరోజులు మాత్రమే కాకుండా.. నెలమొత్తం కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని తెలిపింది. కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడంతో పాటు, పాత కస్టమర్లకు రివార్డులు ప్రకటించనున్నట్టు బిగ్ బజార్ సీఈవో సదాశివ్ నాయక్ తెలిపారు.
రూ. 2500కు పైగా వస్తువులు కొనుగోలు చేసిన వారికి, నగదు బహుమతులు, వివిధ సెగ్మెంట్ లో రూ. 2000 కు తగిన వోచర్స్ జూన్ నుంచి అందుబాటులో ఉంచనున్నట్టు బిగ్ బజార్ పేర్కొంది. ఈ వోచర్లను నెలమొత్తం షాపింగ్ లో ఎప్పుడైనా వాడుకునేలా అవకాశం కల్పించనుంది. రూ.22వేల కోట్లగా ఉన్న తమ రెవెన్యూలను 2021 నాటికి రూ.75 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు తెచ్చుకోవడమే తమ లక్ష్యమని బిగ్ బజార్ ప్రకటించింది. ఫుడ్ అండ్ గ్రోసరీలకు రిటైల్ బాస్కెట్ లోనే డిమాండ్ ఎక్కువగా ఉందని, ఆన్ లైన్ కొనుగోలుకు తక్కువగానే వినియోగదారులు మొగ్గుచూపుతున్నారని బిగ్ బజార్ పేర్కొంది.