ఫేస్‌బుక్‌ సీఈవోకు సీరియస్‌ వార్నింగ్‌ | BJP Alleges Congress Has Links With Cambridge Analytica | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ సీఈవోకు ప్రభుత్వం సీరియస్‌ వార్నింగ్‌

Published Wed, Mar 21 2018 2:55 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

BJP Alleges Congress Has Links With Cambridge Analytica - Sakshi

న్యూఢిల్లీ : సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను దొంగలించిన కేంబ్రిడ్జ్ అనలిటికాతో, కాంగ్రెస్‌కు కూడా లింక్‌ లున్నట్టు బీజేపీ ఆరోపిస్తోంది. ఒకవేళ అవసరమైతే, ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌పై తాము కఠిన చర్యలు తీసుకోవడానికైనా సిద్ధమేనని బీజేపీ అధికార ప్రతినిధి రవి శంకర్‌ ప్రసాద్‌  సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

డేటా చోరీని కాంగ్రెస్‌ పార్టీ తన ప్రయోజనాల కోసం వాడుకుందని, ఎన్నికల్లో గెలువడానికి డేటాను తారుమారు చేసిందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌, పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోషల్‌ మీడియా మేనేజ్‌మెంట్‌లో ఆ డేటా సంస్థ పాత్రను రవి శంకర్‌ ప్రసాద్‌ ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను దొంగతనం చేయడం, తారుమారు చేయడం వంటి వాటికి కాంగ్రెస్‌ పార్టీ పాల్పడుతోదా? అని అన్నారు. 

కేంబ్రిడ్జ్ అనలిటికాతో దేశీయ సిటిజన్ల ప్రైవేట్‌ డేటాను కాంగ్రెస్‌ పార్టీ షేర్‌ చేసిందని ఆయన ఆరోపించారు. 2014 నుంచి ఫేస్‌బుక్‌ యూజర్ల ప్రైవేట్‌ డేటాను కేంబ్రిడ్జ్‌ అనలిటికా చోరి చేస్తుందని పలు న్యూస్‌ రిపోర్టులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంబ్రిడ్జ్‌ అనలిటాకు, కాంగ్రెస్‌ పార్టీకి సంబంధాలున్నాయని ప్రసాద్‌ ఆరోపిస్తున్నారు. ఇది భారత్‌లో ఉచిత, న్యాయపరమైన ఎన్నికలకు సంబంధించి పలు అనుమానాలకు తావిస్తుందని, దేశీయ ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయన్నారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా అధినేత రమ్య కొట్టిపారేశారు. కేంబ్రిడ్జ్‌ అనలిటికాతో కాంగ్రెస్‌కు లింక్‌ ఉన్నాయనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆమె ట్వీట్‌ చేశారు.

కాగా, 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా చోరీ చేసినట్టు అమెరికా, బ్రిటన్ మీడియాలో కథనాలు వచ్చాయి. ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం పనిచేసిన ఈ కన్సల్టెన్సీకి ఫేస్‌బుక్ వినియోగదారుల వివరాలు ఎలా లభించాయన్న అంశంపై ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ వివాదంలో  చిక్కుకున్నారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా  అమెరికా, ఐరోపా విచారణ సంస్థలు ఆదేశాలు జారీచేశాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement