విదేశాలకు తరలిన నల్లధనమెంత?
* కేంద్రం, స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకుల తలో లెక్క
* 12 వేల కోట్ల నుంచి 90 లక్షల కోట్ల వరకు వేర్వేరు అంచనాలు
న్యూఢిల్లీ: నల్లధనంపై కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసిన నేపథ్యంలో విదేశాల్లో మూలుగుతున్న భారతీయుల అక్రమ సొత్తు ఎంత ఉంటుందన్న దానిపై మళ్లీ చర్చ మొదలైంది. ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక లెక్కలు లేనప్పటికీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలు, ప్రైవేట్ ఏజెన్సీలు, స్వచ్ఛంద సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం పలు అంచనాలు మాత్రం ఎప్పటికప్పుడు వెలువడుతున్నాయి. కానీ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ గతంలో వెల్లడించిన మొత్తం మాత్రం బాగా ప్రచారంలోకి వచ్చింది. భారతీయుల విదేశీ ఖాతాల్లోని నల్లధనం విలువ దాదాపు రూ. 28 లక్షల కోట్లు ఉంటుందని 2011లో ఆయన పేర్కొన్నారు.
అమెరికాకు చెందిన అధ్యయన సంస్థ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ రూపొందించిన నివేదికల ఆధారంగా ఈ లెక్క చెబుతున్నట్లు కూడా అద్వానీ తెలిపారు. ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు కట్టకుండా, ఆస్తులు వెల్లడించకుండా విదేశీ ఖాతాల్లో అక్రమంగా సొమ్ము దాచుకున్న భారతీయులు 782 మంది ఉన్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. బీజేపీ కూడా భారీ అంచనాలనే వెల్లడించింది. నల్లధనం మొత్తం దాదాపు 30 నుంచి 90 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని అప్పట్లో పేర్కొంది. ఇక 2012లో పార్లమెంట్‌కు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన శ్వేతపత్రం ప్రకారం నల్లధనం లెక్క రూ. 12,600 కోట్లు మాత్రమే. మరోవైపు 2006లో స్విస్ బ్యాంకింగ్ అసోసియేషన్ విడుదల చేసినట్లు ప్రచారంలోకి వచ్చిన నివేదికలోని భారీ లెక్క కూడా గతంలో వెలుగులోకి వచ్చింది.
అయితే దీన్ని స్విస్ అధికారులు, బ్యాంకుల సంఘం కూడా అప్పట్లోనే ఖండించాయి. కాగా, ఈ ఏడాది మే నెలలో కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ సంస్థ మరో అధ్యయన నివేదికను విడుదల చేసింది. నల్లధనంపై భారత్ ఆందోళన సబబేనని అందులో పేర్కొంది. 2002 నుంచి 2011 మధ్య కాలంలో దేశం దాటిన నల్లధనం మొత్తం దాదాపు రూ. 21 లక్షల కోట్లుగా ఆ సంస్థ తాజాగా వెల్లడించింది. అక్రమ సొమ్ము ప్రవాహం ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో ఉన్నట్లు తెలిపింది.