డీజిల్‌ కార్ల విక్రయాలకు బ్రేకులు..!   | Brakes for diesel cars sales | Sakshi
Sakshi News home page

డీజిల్‌ కార్ల విక్రయాలకు బ్రేకులు..!  

Published Wed, Aug 1 2018 12:34 AM | Last Updated on Fri, Sep 28 2018 3:18 PM

Brakes for diesel cars sales - Sakshi

న్యూఢిల్లీ: కొన్నాళ్ల క్రితం దాకా జోరుగా సాగిన డీజిల్‌ వాహనాల అమ్మకాలు క్రమంగా తగ్గుతున్నాయి. పెట్రోల్, డీజిల్‌ ఇంధనాల రేట్ల మధ్య వ్యత్యాసం తగ్గుతుండటం, డీజిల్‌ వాహనాల వినియోగంపై నియంత్రణలతో అనిశ్చితి తదితర అంశాలు ఇందుకు కారణంగా ఉంటున్నాయి. డీజిల్‌ వాహనాల డిమాండ్‌ తగ్గుతోందనడానికి ఇటీవలే కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టిన పలు ఆటోమొబైల్‌ సంస్థలు ఎదుర్కొన్న పరిస్థితే నిదర్శనం. అమెరికన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం మూణ్నెల్ల క్రితం తమ కంపాక్ట్‌ యుటిలిటీ వాహనం ఫ్రీస్టయిల్‌ను పెట్రోల్, డీజిల్‌ వేరియంట్స్‌లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. సాధారణంగా యుటిలిటీ వెహికల్స్‌కి సంబంధించి కొనుగోలుదారులు ఎక్కువగా డీజిల్‌ వేరియంట్‌ వైపే మొగ్గుచూపుతుంటారు. అయితే, ఫ్రీస్టయిల్‌కి వచ్చిన బుకింగ్స్‌లో ఏకంగా 65 శాతం పెట్రోల్‌ వేరియంట్స్‌వి కాగా, డీజిల్‌ వాహనాలకు వచ్చిన బుకింగ్స్‌ కేవలం 35 శాతమే. ఈ ధోరణి కంపెనీని ఆశ్చర్యపర్చింది. మరో నెల రోజుల అనంతరం ఇంకో దిగ్గజం హోండా .. అమేజ్‌ కారులో కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. దానికి కూడా దాదాపు ఫ్రీస్టయిల్‌ అనుభవమే ఎదురైంది. 2013లో అమేజ్‌ తొలితరం కారును ప్రవేశపెట్టినప్పటికి.. ఇప్పటికి పరిస్థితులు మారిపోయాయని రూఢీ చేసింది. అప్పట్లో అమేజ్‌ కారుకొచ్చిన బుకింగ్స్‌లో ఏకంగా 80 శాతం వాటా డీజిల్‌ వేరియంట్‌దే ఉంది. డిమాండ్‌కి అనుగుణంగా సరఫరా చేసేందుకు డీజిల్‌ కార్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచుకోవాల్సి వచ్చింది కూడా. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈ పరిస్థితి చాలా మటుకు మారిపోయింది. 

మారుతున్న ప్రాధాన్యాలు.. 
దేశీయంగా డీజిల్‌ ఇంజిన్‌ టెక్నాలజీ ఇటీవలి కాలంలో గడ్డుకాలం ఎదుర్కొంటోంది. వివిధ సందర్భాల్లో డీజిల్‌ వాహనాల వినియోగంపై న్యాయస్థానాలు, ప్రభుత్వాల నుంచి ఆంక్షల రూపంలో సమస్యలు  ఎదురవుతున్నాయి. ఢిల్లీ వంటి కీలక మార్కెట్లో నియంత్రణలతో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో వీటి రీసేల్‌ కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. దీనికి తోడు పెట్రోల్, డీజిల్‌ ధరల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిపోవడం కూడా  చాలా మటుకు కార్ల కొనుగోలుదారులు (యుటిలిటీ వాహనాలు మినహా) డీజిల్‌ కార్లతో పోలిస్తే ఎక్కువగా పెట్రోల్‌ కార్లవైపే మొగ్గు చూపేలా చేస్తోంది. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (సియామ్‌) గణాంకాల ప్రకారం.. 2013–14 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో అమ్ముడైన కొత్త కార్లలో డీజిల్‌ కార్ల వాటా 42%గా ఉండగా.. ఈ ఏడాది జూన్‌ త్రైమాసికంలో సగానికి సగం తగ్గి సుమారు 22%కి పరిమితమైంది.

పెరగనున్న పెట్రోల్‌ కార్ల ఉత్పత్తి.. 
ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్‌ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుకోవడంపై ఆటోమొబైల్‌ కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు కేవలం పెట్రోల్‌ కార్లనే తయారు చేసే వ్యూహంలో కూడా ఉన్నాయి. ఇకపై భారత్‌లో నాన్‌–స్పోర్ట్‌ యుటిలిటీ వాహనాల్లో కేవలం పెట్రోల్‌ వేరియంట్‌ మాత్రమే విక్రయించే దిశగా జపాన్‌ కార్ల తయారీ దిగ్గజం టయోటా కసరత్తు చేస్తోంది. ఈ మధ్యే ప్రవేశపెట్టిన యారిస్‌ సెడాన్‌ కారులో అసలు డీజిల్‌ వేరియంట్‌ లేకపోవడం ఈ వార్తలకు ఊతమిస్తోంది. కంపెనీకి చెందిన మరో కారు కరోలా సెడాన్‌లో పెట్రోల్‌ వేరియంట్స్‌ అమ్మకాలు 75% నుంచి 89%కి పెరగడం కూడా ఈ వ్యూహానికి కారణం కానుంది.  సుమారు ఏడెనిమిదేళ్ల క్రితం.. డీజిల్‌ కార్లకు భారీగా డిమాండ్‌ ఉండేది. దీంతో ఆటోమొబైల్‌ కంపెనీలు కూడా డీజిల్‌ ఇంజిన్‌ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవడానికి భారీగా పెట్టుబడులు పెట్టాయి. కానీ ఆ తర్వాత.. కొన్నాళ్లు పెట్రోల్‌.. మళ్లీ డీజిల్‌.. తిరిగి పెట్రోల్‌ కార్లకు డిమాండ్‌ పెరిగింది. రాబోయే రోజు ల్లోనూ కొన్ని సెగ్మెంట్స్‌లో పెట్రోల్‌ ఆధిపత్యమే ఉంటుందని.. అయితే మరికొన్ని విభాగాల్లో డీజిల్‌కి డిమాండ్‌ కొనసాగవచ్చని ఫోర్డ్‌ ఇండియా ఎండీ అనురాహ్‌ మెహ్‌రోత్రా అభిప్రాయపడ్డారు.

యూవీల్లోనూ పెట్రోల్‌ జోరు .. 
యుటిలిటీ వాహనాల్లో (యూవీ) డీజిల్‌ వేరియంట్స్‌దే ఆధిపత్యం ఉంటున్నప్పటికీ.. క్రమంగా పెట్రోల్‌ వేరియంట్స్‌ అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. 2011–12లో యూవీల అమ్మకాల్లో పెట్రోల్‌ వేరియంట్స్‌ వాటా కేవలం 2 శాతమే ఉండగా.. ప్రస్తుతం 16 శాతానికి పెరిగింది. మొత్తం ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలను తీసుకుంటే (యూవీలు, కార్లు, వ్యాన్లు సహా) డీజిల్‌ వాహనాల వాటా 38%కి తగ్గింది. 2016–17లో ఇది 40 శాతంగా ఉంది. అదే 2012–13 గణాంకాలు తీసుకుంటే డీజిల్‌ వాటా ఏకంగా 58 శాతంగా ఉండేది.  

మరింత గడ్డుకాలం.. 
డీజిల్‌ కార్ల విక్రయాలు ఇంకా పడిపోయే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయంటున్నాయి మార్కెట్‌వర్గాలు. 2020 ఏప్రిల్‌ నుంచి భారత్‌ స్టేజ్‌ సిక్స్‌(బీఎస్‌–6) ఉద్గార ప్రమాణాలు అమల్లోకి వచ్చాయంటే డీజిల్, పెట్రోల్‌ కార్ల రేట్ల మధ్య వ్యత్యాసం మరింతగా పెరిగిపోనుంది. ప్రస్తుతం ఈ రెండింటి ధరల మధ్య తేడా సుమారు రూ. లక్ష ఉండగా.. ఇది రూ. 2 లక్షలకు పెరిగిపోవచ్చని అంచనా. అదే జరిగిందంటే.. మెరుగైన ప్రత్యామ్నాయంగా మరింత మంది కొనుగోలుదారులు పెట్రోల్‌ కార్లవైపే మొగ్గు చూపుతారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement