తుదిమెరుగుల్లో...బల్క్ డ్రగ్ పాలసీ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: దేశంలోనే బల్క్ డ్రగ్ రాజధానిగా వెలుగొందుతున్న హైదరాబాద్‌కు మళ్లీ పూర్వ వైభవం రానుంది. బల్క్‌డ్రగ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న విద్యుత్, ఎక్సైజ్, రెగ్యులేటరీ సంబంధిత పలు సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా త్వరలో బల్క్ డ్రగ్ పాలసీని కేంద్ర ప్రభుత్వం రూపొందించనుందని బల్క్‌డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఎమిరటస్ ఎం. నారాయణ రెడ్డి తెలిపారు.
బల్క్‌డ్రగ్‌గా వ్యవహరించే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ) తయారుచేసే డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్, గ్రాన్యూల్స్, దివీస్ ల్యాబొరేటరీస్ తదితర కంపెనీలు దేశంలో అత్యధికంగా హైదరాబాద్ నగరంలో విస్తరించి ఉన్నాయి. రూ. 79,000 కోట్ల ఫార్మా మార్కెట్లో ఏపీఐల వాటా పది శాతం పైగానే ఉంటోంది. హైదరాబాద్ తర్వాత గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఈ పరిశ్రమ విస్తరించింది.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల ఎజెండాలో భాగంగా బల్క్ డ్రగ్ విధానంపై తొలి ముసాయిదాను రూపొందించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు నారాయణరెడ్డి చెప్పారు. ఈ ముసాయిదా రూపకల్పనలో భాగంగా ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆరవ చివరి సమావేశంలో పాల్గొన్నప్పుడు పలు అంశాలు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాసూటికల్స్ (డీఓపీ) ముందుంచామని ఆయన తెలిపారు.
చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయాలి...
బల్క్‌డ్రగ్స్ ఉత్పత్తిలో చైనా పోటీని తట్టుకొని నిలబడే విధంగా పాలసీని రూపొందించినపుడే దేశీయ కంపెనీలు మనుగడ సాగించగలవని, చైనా డంపింగ్‌కు అడ్డుకట్ట వేసే విధంగా విధాన రూపకల్పన జరగాలని తాము సూచించామన్నారు. చైనా నుండి దిగుమతి అయిన బల్క్‌డ్రగ్స్ ల్యాండెడ్ వ్యయం దేశంలో ఉత్పత్తి అయ్యే ఖర్చుతో పోలిస్తే 15-20 శాతం తక్కువగా ఉంటోందన్నారు. దీంతో చైనా ఉత్పత్తులతో మన కంపెనీలు పోటీ పడలేక పోతున్నాయని, మన కంపెనీలకు అడ్వాంటేజ్ కలిగే దిశగా కొత్త పాలసీలో ప్రభుత్వం విధాన ప్రకటన చేయాలని సూచించామన్నారు.
దేశంలో 500కి పైగా వివిధ రకాల బల్క్‌డ్రగ్స్ ఉత్పత్తి అవుతున్నాయని, వీటికి పర్యావరణ అనుమతులు పొందడం పెద్ద సమస్యగా మారిందన్నారు. ఉదాహరణకు ఒక బల్క్‌డ్రగ్‌కు పర్యావరణ అనుమతి దరఖాస్తు చేసిన ఆరునెలల్లోగా మంజూరు చేయాలని నిబంధనలున్నా వాస్తవంగా దీనికి నాలుగు ఏళ్లు పడుతోందన్నారు. బల్క్‌డ్రగ్స్ రంగంలో చిన్న పరిశ్రమలు వందల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని, అయితే దీనికి అనుగుణంగా కామన్ ఎఫ్ల్యూయంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణం యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.