బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ఓ మొబైల్ వాలెట్‌ను ప్రారంభించింది. డిజిటల్ ఇండియా సాధనలోభాగంగా డిజిటల్ చెల్లింపులు సంస్థ మొబిక్విక్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. తద్వారా 100మిలియన్లకు పైగా ఉన్న తన చందాదారులకు వన్ ట్యాప్ బిల్లు పేమెంట్‌ను పద్ధతిని అందుబాటులోకి తీసుకురానున్నట్టు సంస్థ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1.5 మిలియన్ల కేంద్రాల ద్వారా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది.
ముఖ్యంగా అర్ధ పట్టణ, గ్రామీణ భారతదేశానికి చెందిన కస్టమర్ల డిజిటల్ చెల్లింపుల నిమిత్తం తమ కొత్త డిజిటల్ వాలెట్‌ను ఆవిష్కరించినట్టు బీఎస్‌ఎన్‌ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా వినియోగదారులు ఆన్లైన్ రీఛార్జ్, బిల్లు చెల్లింపులు, బస్సు, రైలు టికెట్ బుకింగ్‌తోపాటు షాపింగ్ కూడా చేసుకోవచ్చని చెప్పింది. అలాగే ఇది స్మార్ట్‌ఫోన్ , ఫీచర్ ఫోన్ రెండింటిలోనూ పని చేస్తుంది.
టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా ఈ డిజిటల్ వాలెట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మనోజ్ సిన్హా మాట్లాడుతూ తరచూ నిర్లక్ష్యానికి గురి అవుతున్న గ్రామీణ ప్రాంతాలకు సులభ చెల్లింపుల విధానాన్ని బలోపేతం చేయనున్నామన్నారు.
బీఎస్ఎన్ఎల్, మోబిక్విక్ తో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిజిటల్ ఇండియాని సాధించే దిశగా మరొక ముఖ్యమైన మైలురాయి అని బిఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. ప్రొ-బ్రాండెడ్ మోబిక్విక్ వాలెట్ ద్వారా మొబైల్ మరియు ఇతర ఆర్ధిక చెల్లింపులను చేసుకోవచ్చని చెప్పారు.
ఈ కొత్త వాలెట్ ద్వారా భారతదేశంలో విశ్వసనీయమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, డిజిటల్ చెల్లింపుల సౌలభ్యం లభిస్తుందని మొబీ క్విక్ స్థాపకుడు, సీఈవో బిపిన్ ప్రీత్ సింగ్ చెప్పారు.