వృద్ధి మినహా.. ఫస్ట్ క్లాస్
మోదీ @ 365 days
మోదీ సర్కారు ఏడాది పాలనపై ఆర్థికవేత్తల మాట
⇒ ఆర్థిక వృద్ధిలో జోరు పెరగాల్సి ఉందని సూచన
⇒ స్థూలంగా సరైన దార్లోనే వెళుతున్నారంటూ ప్రశంస
⇒ ఏడాదిలో రూ.10 లక్షల కోట్లు పెరిగిన స్టాక్ మార్కెట్ల సంపద
⇒ అంబానీలకు నష్టాలు... అదానీలకు లాభాలు
సాక్షి, బిజినెస్ విభాగం: ఐదేళ్లు అధికారంలో ఉండే రాజకీయ పార్టీలకు ఏడాది సమయం ఏమంత ఎక్కువ కాదు.
అయితే ఎప్పటి నుంచో మార్పు కోసం ఎదురుచూస్తూ ఒక ప్రభుత్వాన్ని దించి మరో సర్కారుకు పట్టం గట్టిన జనానికి మాత్రం ఏడాదంటే ఎక్కువే. గంపెడాసలు పెట్టుకున్న ఆ ప్రభుత్వం కొంతైనా చేయాలనేది వారి కోరిక. మరి కేంద్రంలో పగ్గాలు చేపట్టిన నరేంద్రమోదీ సర్కారు ఈ ఏడాది కాలంలో ఏం చేసింది?ఆర్థికంగా ఒక ప్రభుత్వం పనితీరుకు స్టాక్ మార్కెట్లే కొలమానమైతే నరేంద్రమోదీ ప్రభుత్వం డిస్టింక్షన్ కొట్టేసినట్లే. ఎందుకంటే ఈ ఏడాది కాలంలో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.10 లక్షల కోట్ల మేర పెరిగింది. టాటా, అదానీ, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, సన్ గ్రూపులు భారీగా లాభపడి దీన్ని సాధ్యం చేశాయి. ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్లు బాగా పడ్డప్పటికీ ఏడాదితో పోలిస్తే 12 శాతం మేర పెరిగాయి. బిర్లా, విప్రో, హెచ్‌సీఎల్, ఐసీఐసీఐ, మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్ వంటివీ దీనికి సాయపడ్డాయి.
ఈ ఏడాది మొదట్లో సెన్సెక్స్ 30 వేల పాయింట్లు తాకి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది కూడా. అయితే మోదీ ప్రభుత్వం అదానీ గ్రూపునకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు మొదటి నుంచీ ఉన్నాయి. అదానీ గ్రూపు మార్కెట్ విలువ కూడా ఇందుకు తగ్గట్టే ఏకంగా రూ.50 వేల కోట్ల మేర పెరిగింది. ఇక అంబానీల పట్ల మోదీ సుముఖంగా వ్యవహరించటం లేదన్న వార్తలూ ఉన్నాయి. రిలయన్స్ గ్యాస్‌కు ముందు నిర్ణయించిన ధరను తగ్గించటం వంటి పరిణామాలతో ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూపు మార్కెట్ విలువ రూ.80 వేల కోట్ల మేర దిగజారగా... ఆయన సోదరుడు అనిల్ అంబానీ గ్రూపు విలువ కూడా రూ.50 వేల కోట్ల మేర పడిపోయింది.
సరే! స్టాక్ మార్కెట్లనేవి ఒక కోణం మాత్రమే. నిజానికివి ప్రభుత్వ పనితీరుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొలమానం కావన్నది కూడా నిపుణుల అభిప్రాయం. అయితే ఎఫ్‌డీఐల విషయంలో పాదర్శకత... విదేశీ వ్యవహారాల్లో దృఢంగా వ్యవహరించటం, నిరుపేదలు సహా అందరికీ బ్యాంక్ ఖాతా సౌకర్యం కల్పించటం, అందరికీ సామాజిక బీమా భద్రత... ఇవన్నీ మోదీ సర్కారుకు మార్కులేశాయి. ‘‘డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా, స్మార్ట్ సిటీ అనే దీర్ఘకాలిక లక్ష్యాలను ప్రకటించడమే కాకుండా.. వాటికి అనుగుణంగా ఫ్రేమ్ వర్క్‌ను కూడా సిద్ధం చేశారు. వీటి ఆధారంగా వ్యాపార అవకాశాలు రావాల్సి ఉంది’’ అనేది నాస్కామ్ చైర్మన్ బి.వి.ఆర్.మోహన్ రెడ్డి మాట.
ఈ ఏడాది పాలనలో అవినీతి బాగా తగ్గిందంటూనే కార్పొరేట్ సంస్థలు మోదీపై భారీ ఆశలు పెట్టుకోవటంతో వాటిని మోదీ అందుకోలేకపోయారని, మున్ముందు వీటిని అందుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. స్థూలంగా ఆర్థిక మూలాలను మార్చి కార్మిక సంస్కరణల ద్వారా భారతదేశ పోటీతత్వాన్ని పెంచినా ఆర్థిక వృద్ధి నెమ్మదించటం, భారతదేశంలో వ్యాపారం చేయటమనేది ఇప్పటికీ సంక్లిష్టమైన ప్రక్రియలానే ఉండటం ప్రతికూలాంశాలుగా ఉన్నాయి.
మునుపటితో పోలిస్తే పర్యావరణ అనుమతులు వేగంగానే వస్తున్నాయి. అయితే పాత తేదీల నుంచి పన్నులు వడ్డించటమనే మోదీ విధానం సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. మోదీ ఇప్పటిదాకా 19 దేశాలు తిరిగి భారతదేశంలో పెట్టుబడులను ఆహ్వానిస్తూ కల్పించినా సానుకూల ధోరణి కూలిపోవటానికి ఈ ఒక్క కారణం చాలన్నది ఆర్థిక నిపుణుల మనోగతం.
ఆర్థిక వృద్ధి అంతంతే...
తాను చెప్పేవాడిని కానని, చేసే వాడినని ఎన్నికల్లో మోదీ చేసుకున్న ప్రచారాన్ని సామాన్యులు విశ్వసించారు. ఇప్పటికీ మోదీపై వారిలో అదే అభిప్రాయం ఉండొచ్చు. కానీ వ్యాపార, ఆర్థిక వర్గాల్లో మాత్రం అలాంటిది లేదనేది బ్రోకింగ్ సంస్థ ‘సీఎల్‌ఎస్‌ఏ’ సీనియర్ ఎకనమిస్ట్ రాజీవ్ మాలిక్ మాట. ఆర్థిక వృద్ధిలో ప్రభుత్వ పనితీరు మెరుగ్గా లేదంటున్నారాయన. ఇక గోద్రెజ్ గ్రూపు సంస్థల అధిపతి ఆది గోద్రెజ్ ఇటీవల ఫోర్బ్స్ పత్రికలో రాసిన వ్యాసంలో మోదీని చేతల మనిషిగానే అభివర్ణించారు. ‘‘అయితే భారతదేశంలో వ్యాపారం చేయటానికి అనువైన పరిస్థితులింకా రాలేదు.
పన్నులు చెల్లించేవారిని వినియోగదారులుగా చూడాలి తప్ప శత్రువులుగా కాదు. పాత తేదీల నుంచి పన్నులు చెల్లించాలనే ఉత్తర్వులు ఇక వద్దు’ అని పేర్కొన్నారు. ‘మోదీ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణల్లో అత్యంత ప్రధానమైనది కార్మిక చట్టాల సవరణ. దీనివల్ల కొత్త కంపెనీలు, కొత్త పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చే ఆస్కారం ఉంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం తయారీకి బూస్ట్‌నిస్తుంది’ అని తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కె.సుధీర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
కోటలు దాటిన మాటలు...
2 ట్రిలియన్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 20 ట్రిలియన్లకు తీసుకెళతానన్నది మోదీ చేసిన వాగ్దానం. నిజానికి అంతర్జాతీయంగా తిరుగులేని శక్తిగా మారిన చైనా ఆర్థిక వ్యవస్థే ఇపుడు 10 ట్రిలియన్ డాలర్లు. అందుకని మోదీ వాగ్దానాలపై ఆర్థిక నిపుణులు కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు. ‘‘కలల కోటలు ఆ క్షణానికి అందంగానే కనిపిస్తాయి. కానీ వాటిని నిజంగా కట్టాలంటే సుదీర్ఘమైన, దృఢమైన మార్గం కావాలి’’ అనేది ఆర్థిక వేత్త ప్రవీణ్ కృష్ణ మాట. నిజానికి అంతర్జాతీయ చమురు ధరలనేవి మోదీకి గాలివాటు మాదిరి కలిసొచ్చాయి.
మన దేశ దిగుమతుల్లో 80 శాతానికి పైగా ఆక్రమిస్తున్న చమురు ధరలు భారీగా పతనం కావటం మోదీ సర్కారుకు ఊహించని మేలు చేసింది. ఇక మోదీ పిలుపు విని భారతదేశంలో కర్మాగారాలు పెట్టడానికి ముందుకొచ్చిన సంస్థల్లో కొరియన్ దిగ్గజం శామ్‌సంగ్, యూరోపియన్ ఎయిర్‌బస్ కూడా ఉన్నాయి. ద్రవ్యోల్బణం 9 శాతం నుంచి 5 శాతానికి తగ్గటం ఆర్థిక వృద్ధి 5 నుంచి 7.5 శాతానికి చేరే అవకాశాలుండటం... ఇవన్నీ భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగించే ఘటనలే.
కార్పొరేట్లకు దూరం జరిగే ప్రయత్నం...
గుజరాత్ ముఖ్యమంత్రిగా దీర్ఘకాలం వ్యవహరించినపుడు కార్పొరేట్లకు వ్యాపార అవకాశాలు కల్పించిన వ్యక్తిగా మోదీ పేరు సంపాదించుకున్నారు. దాంతో ఆయన ప్రధాని కాగానే వ్యాపారుల ప్రయోజనాల కోసం పనిచేసే ప్రభుత్వమంటూ విమర్శలు వెల్లువెత్తాయి. గతేడాది నవంబర్‌లో మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో అదానీ గ్రూప్‌కి బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడానికి ఎస్‌బీఐ ఒక ఒప్పందం చేసుకుంది. ఆ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మోదీకి సన్నిహితుడిగా ముద్రపడటంతో కార్పొరేట్లకు దగ్గరుండి మరీ పనులు చేస్తున్నారంటూ విపక్షాలు దుమ్మెత్తిపోసాయి.
దీంతో మోదీ కార్పొరేట్లకు దూరంగా వుండే ప్రయత్నం చేస్తున్నట్లు ఇటీవలి ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే అదానీ రుణ ఒప్పందం 2014 నవంబర్‌లో జరిగినా, ఇప్పటికీ రుణం మంజూరు కాలేదు. ఆస్ట్రేలియా ప్రాజెక్టుకు సంబంధించి అదానీ ఇచ్చిన సమాచారం సంతృప్తికరంగా లేదంటూ రుణ ప్రతిపాదనను ఎస్‌బీఐ అటకెక్కించిందని వార్తలొచ్చాయి. అంబానీలూ మోదీకి సన్నిహితులనేది ఆది నుంచీ వస్తున్న మాట. కానీ ముకేశ్ అంబానీకి ఇటీవలి కాలంలో మోదీ అపాయింట్‌మెంటే ఇవ్వలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంచనాలు ఎక్కువ పెట్టుకున్నాం...
మోదీ ప్రభుత్వంపై అంచనాలు ఎక్కువగా పెట్టుకున్నారు. కానీ వీటిని పట్టించుకోకుండా ప్రభుత్వం సరైన మార్గంలోనే వెళుతోంది. ఈ ఏడాది పరిపాలనలో ఇంతవరకు ఎటువంటి తప్పులూ జరగలేదు. నిర్ణయాలు తీసుకోవడంలో కొంత స్పీడ్ పెరగాల్సి ఉంది. మొత్తం మీద వృద్ధిరేటును గాడిలో పెట్టే విధంగానే చర్యలు తీసుకుంటున్నారు.
- సి.పార్థసారధి, చైర్మన్ కార్వీ గ్రూపు
అంతర్జాతీయంగా గుర్తింపు..
ఏడాది పరిపాలనపై అప్పుడే ఒక నిర్ణయానికి రాలేం. మరికొంత సమయం ఇవ్వాలి. కానీ అంతర్జాతీయంగా ఇండియాకు గుర్తింపు తేవటానికి ఈ ఏడాది కాలాన్ని చక్కగా వినియోగించుకున్నారు. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యాన్నివ్వటం హర్షించదగ్గ పరిణామం.
- నృపేంద్ర రావు, చైర్మన్, పెన్నార్ గ్రూపు
కార్పొరేట్లలో భయాలు తొలిగాయి..
కొన్నేళ్లుగా భారతీయ కార్పొరేట్ సంస్థలు ఎదుర్కొంటున్న స్కాంలు, సీబీఐ దాడులు వంటివి ఏమీ లేకుండా ఈ ఏడాది కాలం సజావుగా సాగిపోయింది. దీంతో కార్పొరేట్ సంస్థల్లో నెలకొన్న భయాందోళనలు తొలిగాయి. గత ప్రభుత్వాలు చేసిన తప్పులతో ఇన్‌ఫ్రా రంగం చాలా దెబ్బతింది. అదంతా ఏడాదిలోనే కోలుకోవాలంటే అత్యాశే.
- ఇ.సుధీర్ రెడ్డి, సీఎండీ, ఐవీఆర్‌సీఎల్ ఇన్‌ఫ్రా
నమ్మకం కుదిరింది..
మోదీ విదేశీ పర్యటనలతో ఇన్వెస్టర్లలో నమ్మకం ఏర్పరిచారు. దేశంలో సంస్కరణలకు తెరతీశారు. వ్యవస్థను క్రమబద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు. రానున్న రోజుల్లో పెట్టుబడులు మరింత పెరుగుతాయి. ప్రభుత్వం పట్ల వ్యాపారవేత్తల అంచనాలు ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రత్యేక హోదా విషయంలో అసంతృప్తి ఉంది.
- సురేష్ రాయుడు చిట్టూరి, చైర్మన్, సీఐఐ ఆంధ్రప్రదేశ్