టీడీఎస్‌ రేటు తగ్గింపు అమల్లోకి.. | CBDT notifies reduction in TDS And TCS | Sakshi
Sakshi News home page

టీడీఎస్‌ రేటు తగ్గింపు అమల్లోకి..

Published Fri, May 15 2020 3:04 AM | Last Updated on Fri, May 15 2020 3:04 AM

CBDT notifies reduction in TDS And TCS - Sakshi

న్యూఢిల్లీ: డివిడెండ్, అద్దె, బీమా చెల్లింపులు తదితర వేతనేతర చెల్లింపులపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్‌), మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్‌) రేట్లను తగ్గిస్తూ ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీడీబీటీ) గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సవరించిన రేట్లు గురువారం నుంచే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. 2021 మార్చి 31 వరకు ఇవే రేట్లు అమల్లో ఉంటాయని తెలిపింది. ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు గాను కంపెనీలు, పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ.. టీడీఎస్, టీసీఎస్‌ రేటును ప్రస్తుత రేటుపై 25 శాతం తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన చేసిన మరుసటి రోజే అందుకు సంబంధించి ఆదేశాలు వెలువడ్డాయి.

► 23 ఐటమ్స్‌పై టీడీఎస్‌ తగ్గింది. రూ.10 లక్షలు మించిన మోటారు వాహనంపై టీడీఎస్‌ 1 శాతం నుంచి 0.75 శాతానికి తగ్గింది.
► జీవిత బీమా పాలసీకి సంబంధించి పాలసీదారునికి చేసే చెల్లింపులపై టీడీఎస్‌ 5 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గింది.
► డివిడెండ్, వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ 10 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గింది.  
► చరాస్తి కొనుగోలుపై 1 శాతం టీడీఎస్‌ 0.75 శాతానికి తగ్గింది.  
► వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు చేసే అద్దె చెల్లింపులపై టీడీఎస్‌ 5% నుంచి 3.75%కి సవరించారు.  
► ఈ కామర్స్‌ వేదికపై విక్రేతలకు వర్తించే టీడీఎస్‌ రేటు 1 శాతం నుంచి 0.75 శాతానికి మారింది.  
► వృత్తి ఫీజు 2 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గింది.  
► నేషనల్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ డిపాజిట్‌ మొత్తాలను తిరిగి చెల్లించే సందర్భంలో వర్తించే టీడీఎస్‌ రేటు 10 శాతం నుంచి 7.5 శాతానికి దిగొచ్చింది.  
► బీమా కమీషన్, బ్రోకరేజీపై 5 శాతం నుంచి 3.75 శాతానికి టీడీఎస్‌ సవరించారు.  
► మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్‌ హోల్డర్లకు చేసే డివిడెండ్‌ చెల్లింపులపై టీడీఎస్‌ 10 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గింది.  
► టెండ్‌ లీవ్స్‌ (బీడీ ఆకులు), తుక్కు, కలప, అటవీ ఉత్పత్తులు, బొగ్గు, లిగ్నైట్, ఐరన్‌ ఓర్‌ తదితర మినరల్స్‌పై టీసీఎస్‌ తగ్గింది.  
► పాన్‌/ఆధార్‌ సమర్పించని కేసుల్లో అధిక టీడీఎస్‌/టీసీఎస్‌ వసూలు చేయాల్సిన చోట ఈ తగ్గింపులు వర్తించవని సీబీడీటీ స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement