సీబీఈసీ.. ఇక సీబీఐసీ
♦ జూన్ 1వ తేదీ నాటికి ఏర్పాటు
♦ సీబీఐసీ కింద దేశవ్యాప్తంగా 21 జీఎస్టీ జోన్‌లు, 102 కమిషనరేట్లు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జులై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో కేంద్రంలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెచ్‌ఆర్‌డీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్’(సీబీఈసీ) స్థానంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ)ను తీసుకు వస్తున్నారు. జూన్ మొదటి తేదీ లోగా ఇది ఏర్పాటు కానుంది. సీబీఐసీలో ఛైర్మన్‌తో పాటు జీఎస్టీ అండ్ సెంట్రల్ ట్యాక్స్, ఐటీ లీగల్, ఇన్వెస్టిగేషన్, ట్యాక్స్ పాలసీ, కస్టమ్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ విజిలెన్స్ విభాగాలకు చెందిన ఆరుగురు సీబీఐసీలో కీలక సభ్యులుగా ఉంటారు. ఇకపోతే సీబీఐసీ నూతన స్వరూపంలో దేశవ్యాప్తంగా∙21 జీఎస్టీ జోన్‌లు, 102 జీఎస్‌టీ పన్ను చెల్లింపు సర్వీస్ కమిషనరేట్లు ఉండడంతో పాటు 14 జీఎస్‌టీ సబ్ కమిషనరేట్లు, 768 డివిజన్లు, 3969 రేంజి కార్యాలయాలు పని చేస్తాయి.
ఇవి మాత్రమే కాకుండా 49 జీఎస్‌టీ ఆడిట్ కమిషనరేట్లు, 50 జీఎస్‌టీ అప్పీల్ కమిషనరేట్లు, 11 కస్టమ్స్ జోన్లు, 60 కస్టమ్స్ కమిషనరేట్లు, 10 కస్టమ్స్ అప్పీల్లు కస్టమ్స్ కమిషనరేట్లు సీబీఐసీ పరిధిలోనే ఉంటాయి. కొత్త సీబీఐసీ క్రింద చిన్నచిన్న కేంద్రాల్లో సైతం జీఎస్‌టీ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వీటిని విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిల్లో ఏర్పాటు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చెల్‌లతో పాటు మరో పట్టణంలో వీటిని ఏర్పాటుచేస్తారన్నది సమాచారం. సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ కమిషనరేట్లు ఇకపై జీఎస్‌టీ పన్ను చెల్లింపు సర్వీసు కమిషనరేట్లుగా మారనున్నాయి. కొత్తపన్ను చెల్లింపుదారులందరూ కొత్త సీబీఐసీ పరిధిలోకే వస్తారని కేంద్ర ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను వ్యవస్థ విజయవంతం కావాలంటే సంస్కరణలు అవసరమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ భావిస్తోంది.