సెలూన్లపై సెలబ్రిటీల కన్ను! | celebraties are focus on Salons | Sakshi
Sakshi News home page

సెలూన్లపై సెలబ్రిటీల కన్ను!

Published Tue, Jun 9 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM

సెలూన్లపై సెలబ్రిటీల కన్ను!

సెలూన్లపై సెలబ్రిటీల కన్ను!

దేశంలో ‘నష్టం లేని వ్యాపారమేదైనా ఉందంటే అది సెలూన్ షాపే’ అనేది ఇదివరకటి జోకు. కానీ... అందానికి మెరుగులద్దే ఈ సెలూన్ వ్యాపారంలో అందనంత లాభాలున్నాయనేది నేటి వాస్తవం. అందుకే సెలబ్రిటీలు, కార్పొరేట్లూ అందరూ బ్యూటీ మార్కెట్‌పై దృష్టి సారించారు. దాదాపు రూ.40 వేల కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ ఉండి... 34 లక్షల మందికి ఉపాధినిస్తున్న ఈ వ్యాపారంలోకి దిగటమే కాక జోరుగా విస్తరణకూ సన్నాహాలు చేస్తున్నారు.
- బిజినెస్ బ్యూరో,  హైదరాబాద్
 
• స్పా, సెలూన్, జిమ్, మేకోవర్ స్టూడియోలతో రంగంలోకి
• దేశంలో అందం, ఆరోగ్యం పరిశ్రమ రూ.41,224 కోట్లు
• ఏటా 20-23 శాతం వృద్ధి రేటు నమోదు
• 2018 నాటికి రూ. 80,370 కోట్లకు చేరొచ్చని అంచనా
• దక్షిణాది రాష్ట్రాలపై అంతర్జాతీయ సంస్థల దృష్టి

 
సెలబ్రిటీలకు వ్యాపారాలు కొత్త కాదు. కాకపోతే సెలూన్, స్పా వ్యాపారమనేది ఇప్పటి ట్రెండ్. ఈ ట్రెండ్ ఇపుడు తెలుగు సినీ పరిశ్రమకు కూడా శరవేగంగా పాకింది.
ఉదాహరణకు మెగాస్టార్ తనయుడు, హీరో రామ్‌చరణ్‌నే తీసుకుంటే... ఈయన జూబ్లీహిల్స్‌లో లాటిట్యూడ్స్ పేరుతో జిమ్, సెలూన్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఇక ఒకప్పటి హీరోయిన్ రాశి... శ్రీనగర్‌కాలనీలో కలర్స్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట బ్యూటీ సెంటర్‌ను నిర్వహిస్తోంది. బరువు తగ్గటం, ఒబేసిటీ వంటివి తమ స్పెషాలిటీలుగా ఈ సంస్థ చెబుతోంది. గాయని స్మిత జూబ్లీహిల్స్‌లో బబూల్స్ పేరుతో బ్యూటీ సెలూన్ అండ్ స్పాను నడుపుతోంది. ఇక నటి రాజ్యలక్ష్మి బంజారా హిల్స్‌లో మిర్రర్ పేరిట సెలూన్, స్పా సెంటర్‌ను ప్రారంభించారు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. అంతెందుకు! బాలీవుడ్ హీరో ఫర్హాన్ అఖ్తర్ భార్య అధునా అఖ్తర్ సహ భాగస్వామిగా ప్రారంభించిన ‘బి:బ్లంట్’ కూడా ఇటీవలే హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో బ్రాంచి తెరిచింది. ఈ సంస్థలో గోద్రెజ్ కన్స్యూమర్ కేర్ 30% ఇన్వెస్ట్ చేసింది.

ఏటా 20-23 శాతం వృద్ధి...
భారతీయ సౌందర్య పరిశ్రమ ప్రధానంగా చర్మం, జుట్టు, రంగులు, సుగంధ ద్రవ్యాలు అనే విభాగాలుగా విస్తరిస్తోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో దేశంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో అందం, ఆరోగ్య సంరక్షణ వ్యాపారం రూ.41,224 కోట్లుగా నమోదైనట్లు ఇటీవల ఫిక్కీ, ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ కలిసి విడుదల చే సిన నివేదిక వెల్లడించింది. మొత్తం మార్కెట్‌లో పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల వాటా 25-35%. ఏటా 20-23 శాతం వృద్ధిని నమోదు చే స్తున్న ఈ పరిశ్రమ 2018 నాటికి రూ.80,370 కోట్లకు చేరుకుంటుందనేది నిపుణుల అంచనా.

సర్వీస్ ట్యాక్స్ ప్రభావం...
‘‘గతంలో సగటున 45 రోజులకోసారి సెలూన్‌కు వచ్చేవారు ఇపుడు 30 రోజులకే వస్తున్నారు. సింగిల్ సర్వీస్ బదులు రెండు గంటలుండి మూడు సర్వీసులు చేయించుకుంటున్నారు. వ్యాపారం బాగా పెరుగుతోంది’’ అని హైదరాబాద్‌లో 7 బ్రాంచ్‌లు నడుపుతున్న ఎన్‌ఆర్‌బీ బ్యూటీ సెలూన్ నిర్వాహకుడు నందు చెప్పారు. సౌందర్య పోషణ పై ప్రజల్లో ఆసక్తి పెరగడంతో ఖర్చుకు వెనకాడటం లేదన్నారు. ఏటా విదేశాల నుంచి మన దేశానికి 400 మిలియన్ డాలర్ల విలువైన సుగంధ ద్రవ్యాలు, తైలాలు దిగుమతి అవుతున్నాయని వీఎల్‌సీసీ గ్రూప్ ఫౌండర్, చైర్ పర్సన్ వందన లూథ్రా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు చెప్పారు. తాజాగా సర్వీస్ టాక్స్ పెంపుతో సేవలు ఖరీదయ్యే అవకాశం ఉందన్నారు. సెలూన్లలో మెనిక్యూర్, పెడిక్యూర్, వాకింగ్స్, థ్రెడింగ్, ఫేషియల్స్‌కు రూ.4,000 నుంచి రూ.6,000 వరకు... కేశ సంరక్షణకు రూ.12,000 వరకు ఖర్చవుతుంది.

అంతర్జాతీయ కంపెనీలు దక్షిణాదిలో...
ఇటాలియన్ కంపెనీ బొటెగా డి లుంగావిటా (బీడీఎల్) దేశంలో ఈ ఏడాది ముగిసేసరికి వంద ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉంది. ఈ నెలాఖరులోగా ఉత్తరప్రదేశ్‌లోని పలు నగరాల్లో 7-8 స్టోర్లను ప్రారంభించి, ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను తెరవనుంది. ఈ కంపెనీ ప్రస్తుతం 180కి పైగా  సౌందర్య ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఫ్రెంచ్ కాస్మోటిక్ కంపెనీ లోరియాలా పారిస్ ఈ ఏడాది చివరికి బెంగళూరు, చెన్నైల్లో, ఆపైన హైదరాబాద్‌లో స్టోర్లను ప్రారంభించనుంది. పీఈ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించేందుకు ప్రముఖ సెలూన్  చెయిన్ జావేద్ హబీబ్స్ ప్రయత్నిస్తోంది. షహనాజ్ హుస్సేన్, ఎన్‌రిచ్ బ్యూటీ సెలూన్స్, వైఎల్‌జీ వంటి కంపెనీల విస్తరణలో పడ్డాయి.
 
ఆన్‌లైన్‌లో అమ్మకాలు 30,000 కోట్లు..

హై ఎండ్ కాస్మెటిక్స్, చర్మ సంరక్షణ ఉత్పత్తుల అమ్మకాలు ఆఫ్‌లైన్లో కంటే ఆన్‌లైన్లోనే ఎక్కువ. గూగుల్ అధ్యయనం ప్రకారం.. 2020 నాటికి ఆన్‌లైన్‌లో సౌందర్య సంరక్షణ ఉత్పత్తుల అమ్మకాలు సుమారు రూ. 30,000 కోట్లకు చేరుకుంటాయి. వచ్చే ఐదేళ్లలో ఎఫ్‌ఎంసీజీ సంస్థల అమ్మకాల్లో సుమారు 10 శాతం వాటా ఈ-కామర్స్ ద్వారానే జరుగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆన్‌లైన్ అమ్మకాలపై ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు దృష్టి సారించాయి. లోరియల్‌కి సంబంధించి ప్రధాన బ్రాండ్స్ లోరియల్ ప్యారిస్, గార్నియర్ విక్రయాల్లో 1 శాతం వాటా ఆన్‌లైన్ అమ్మకాలదే. మేబెలీన్  బ్రాండ్ మేకప్ శ్రేణి టర్నోవరులో 3 శాతం వాటా ఆన్‌లైన్‌దే. దీంతో జార్జియో అర్మానీ, ఈవ్స్ సెయింట్ లారెంట్, ల్యాంకోమ్ వంటి లగ్జరీ సౌందర్య సాధనాలు, లా రోష్-పొసే, విషీ వంటి కాస్మొటిక్స్‌ను కూడా ఆన్‌లైన్‌లోకి తెస్తున్నాయి. షీసీడో తాజాగా జెడ్‌ఏ బ్రాండ్ కింద కొత్తగా మేకప్ ఉత్పత్తులను ఆన్‌లైన్లోనూ ప్రవేశపెట్టే యోచనలో ఉంది.
 
మహిళలతో సమానంగా పురుషులూ..
సౌందర్య పోషణకు మహిళలతో పాటు పురుషులూ భారీగానే ఖర్చు చేస్తున్నారు. ఇది దాదాపు 200 మిలియన్ డాలర్లని అసోచామ్ నివేదిక చెబుతోంది. ఆ నివేదిక ముఖ్యాంశాలు చూస్తే...
65 శాతం టీనేజర్లు తమ జేబులోని 75 శాతం సొమ్మును కాస్మొటిక్స్‌కే వెచ్చిస్తున్నారు.
విదేశాల్లో 55 ఏళ్లు దాటినవారిని టార్గెట్ చేసే కాస్మొటిక్ కంపెనీలు ఇక్కడ 30 దాటిన వారిని టార్గెట్ చేస్తూ ఉత్పత్తులు తెస్తున్నాయి.
2004కు ముందు ఏటా సగటున 50 కొత్త సౌందర్య ఉ త్పత్తులు మార్కెట్లోకొచ్చేవి. ఇప్పుడీసంఖ్య 350 పైనే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement