ప్రయోగిస్తే దుర్వార్తే: చిదంబరం | Centre Desperate, Hiding Facts On Economy, Says P Chidambaram | Sakshi
Sakshi News home page

ప్రయోగిస్తే దుర్వార్తే: చిదంబరం

Published Thu, Nov 1 2018 12:54 AM | Last Updated on Thu, Nov 1 2018 12:54 AM

 Centre Desperate, Hiding Facts On Economy, Says P Chidambaram - Sakshi

కేంద్రం సెక్షన్‌ 7ని ప్రయోగించిందంటే అది దుర్వార్తేనని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి చిదంబరం వ్యాఖ్యానించారు. ఇదే జరిగితే ప్రభుత్వానికి దిక్కు తోచడం లేదని, ఆర్థిక వ్యవస్థ గురించి వాస్తవాలను తొక్కిపెట్టి ఉంచుతోందని భావించాల్సి ఉంటుందన్నారు. ‘‘పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నా గత ప్రభుత్వాలు ఎన్నడూ సెక్షన్‌ 7ని ఉపయోగించలేదు. 1991లో, 1997లో, 2008 ఆ తర్వాత 2013.. ఎన్నడూ మేం దీన్ని ప్రయోగించలేదు. అలాంటిది ఈ సెక్షన్‌ను ఇప్పుడెందుకు ప్రయోగించాల్సి వస్తోంది? ఆర్థిక వ్యవస్థ గురించిన వాస్తవాలను ప్రభుత్వం తొక్కిపెడుతోందని, దానికి ఏం చేయాలో దిక్కు తోచడం లేదని ఇది సూచిస్తోంది‘ అని చిదంబరం వ్యాఖ్యానించారు.  

స్వతంత్ర సంస్థలు నాశనం: రాహుల్‌ 
‘ఒకవైపు సమైక్యతకు నిదర్శనంగా సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న తరుణంలో.. ఆయనే ప్రాణం పోసిన ప్రతి వ్యవస్థను ధ్వంసం చేస్తుండటం చాలా చిత్రమైన విషయం. ఇది రాజద్రోహానికి తక్కువేమీ కాదు‘ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లోనూ గత ప్రభుత్వాలు ఉపయోగించని సెక్షన్‌ 7ని ప్రయోగించాల్సిన అత్యవసర పరిస్థితి ఏం వచ్చిందో చెప్పాలని కూడా కాంగ్రెస్‌ ప్రశ్నించింది. ‘‘దేశానికి మూలస్తంభాలుగా ఉన్న సంస్థలన్నింటినీ సర్వనాశనం చేసేందుకు ఎన్‌డీఏ–బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. సీబీఐ విషయంలో ఏం జరిగిందో అంతా చూశాం. ప్రధాని, ఆర్థిక మంత్రి ఇప్పుడు ఆర్‌బీఐపై దండెత్తారు. సెక్షన్‌ 7ని ప్రయోగించాల్సినంత అత్యవసర పరిస్థితులు ఏం నెలకొన్నాయో వివరించాలని ఆర్థిక మంత్రిని అడుగుతున్నాం. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి వివరణా రాలేదు‘ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనీష్‌ తివారీ వ్యాఖ్యానించారు. ప్రజా ప్రయోజనాలకు భంగం వాటిల్లేంత తీవ్రమైన ఆర్థిక అత్యయిక పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రమే ప్రయోగించడానికి సెక్షన్‌ 7ని ఉద్దేశించారని, అలాంటి సందర్భాల్లో మాత్రమే ఆర్‌బీఐకి కేంద్రం ఆదేశాలు ఇవ్వొచ్చని తివారి చెప్పారు. దేశంలో గవర్నెన్స్‌ అన్న మాటే లేకుండా పోయిందని తివారి ఆక్షేపించారు. ‘ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిపై కేంద్రం దాడిచేయడం ఆందోళనకరమైన విషయం. దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎకానమీని అస్తవ్యస్తం చేసేసిన ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి జైట్లీ.. ఇప్పుడిక ఆర్‌బీఐ విశ్వసనీయతను కూడా దెబ్బతీస్తున్నారు’ అని కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ పేర్కొన్నారు.  

కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే: సీపీఎం 
డిఫాల్ట్‌ అవుతున్న కార్పొరేట్లకు బ్యాంకుల నుంచి రుణాలిప్పించి, గట్టెక్కించడం కోసం ఆర్‌బీఐపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీపీఎం వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థ, పార్లమెంటు, సీబీఐల తర్వాత మోదీ ప్రభుత్వం ఇప్పుడిక ఆర్‌బీఐని దెబ్బతీసే పనిలో పడిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తప్పులన్నింటినీ సంస్థలపై రుద్దే ప్రయత్నం చేస్తోందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement