ఈ ఏడాది 8% వృద్ధి ఆశిస్తున్నాం..
సీఐఐ ప్రెసిడెంట్ నౌషద్ ఫోర్బ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఎకానమీ వృద్ధి 8%నికి చేరుతుందని ఆశిస్తున్నట్టు సీఐఐ తెలిపింది. ఈసారి సాధారణ రుతుపవనాలు ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో ఈ స్థాయి వృద్ధి సాధ్యమేనని సీఐఐ ప్రెసిడెంట్ నౌషద్ ఫోర్బ్స్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఏపీ, గుజరాత్‌లు కార్మిక చట్టాల సంస్కరణలు చేపట్టాయి. తమిళనాడు, రాజస్తాన్‌లు భూ చట్టాలను సంస్కరించాయి.
మిగిలిన రాష్ట్రాలు వీటిని అనుసరించాల్సి ఉంది. జీఎస్‌టీ అమలుకై ప్రతిపక్ష పార్టీలతో చర్చిస్తున్నాం. జీఎస్‌టీ అమలైతే దేశంలో ఒక్కో కుటుంబానికి ఏటా రూ.8,000 అదనపు ఆదాయం సమకూరుతుంది’ అని అన్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగిందని, ఈ క్రమంలో 2016-17లో పరిశ్రమ వృద్ధి 5-6% ఉండొచ్చని చెప్పారు.
స్టార్టప్ సెంటర్లు: సీఐఐ జాతీయ స్టార్టప్ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తోంది. రూరల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ఇది ప్రోత్సహిస్తుంది. అలాగే ప్రపంచ స్థాయి యూనివర్సిటీతోపాటు 100 ఎకరాల విస్తీర్ణంలో కన్వెన్షన్ సెంటర్ నెలకొల్పనుంది. పీపీపీ విధానంలో ఇవి రానున్నాయని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు. తెలంగాణలోనూ స్టార్టప్ సెంటర్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు.