
కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ పన్నులను మార్చొద్దు..
బడ్జెట్‌లో యథాతథంగానే కొనసాగించాలి: సీఐఐ
న్యూఢిల్లీ: రానున్న బడ్జెట్‌లో సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాలతో పాటు సర్వీస్ పన్నును యథాతథంగా కొనసాగించాలని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం సర్వీస్ పన్ను, ఎక్సైజ్ సుంకాలు 12 శాతం చొప్పున ఉండగా.. కస్టమ్స్ సుంకం 10 శాతంగా అమలవుతోంది. తయారీ రంగం ఇంకా మందగమనంలోనే ఉందని.. మరోపక్క, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం విజయవంతమవ్వాలంటే ఈ సుంకాలు, పన్నులను పెంచకూడదని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు.
ఈ నెల 28న మోదీ సర్కారు తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరున్ జైట్లీ ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ప్రతిపాదిత వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ని వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలని సీఐఐ కోరింది. ఆదాయ తటస్థ రేటు(ఆర్‌ఎన్‌ఆర్)పై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్, జీఎస్‌టీ ముసాయిదా బిల్లు రూపకల్పనలో పరిశ్రమ వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించాలని కూడా బెనర్జీ పేర్కొన్నారు.
సీఐఐ విజ్ఞప్తుల్లో ఇతర ముఖ్యాంశాలివీ..
తయారీ రంగంలో డిమాండ్ ఇంకా మందకొడిగానే ఉన్నందున దీనికి గతంలో ఇచ్చిన సుంకాల తగ్గింపు చర్యలు చాలా అవసరం. 2014 ఫిబ్రవరిలో తయారీ రంగానికి ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీలో భాగంగా ఎక్సైజ్ సుంకాన్ని 12 నుంచి 10 శాతానికి తగ్గించడం తెలిసిందే. అయితే, దీన్ని గత డిసెంబర్‌లో ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
ఆటోమోటివ్ విడిభాగాల పరిశ్రమకు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలి. వాహన పరిశ్రమ కంటే ఈ విభాగంలో సుంకం అధికంగా ఉండటంవల్ల ఇబ్బందులు నెలకొన్నాయి.
యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రీడియెంట్స్(ఏపీఐ), ఫ్లై యాష్ ఉత్పత్తులు, ప్యాకేజింగ్ మెటీరియల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమతో పాటు పలు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది.
కస్టమ్స్ సుంకాన్ని ఇప్పుడున్న 10 శాతంగానే కొనసాగించాలి. దీని గరిష్టస్థాయిల్లో తగ్గింపులు చేయొద్దు. దీనివల్ల ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ప్రతికూలంగా పరిణమిస్తుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కారణంగా మలేసియా, థాయ్‌లాండ్, ఆసియాన్ ఇతరత్రా దేశాల నుంచి దిగుమతయ్యే చాలావరకూ ఉత్పత్తులపై తక్కువ కస్టమ్స్ సుంకాన్ని వర్తింపజేయాల్సి వస్తోంది.
కొన్నిరకాల మెటల్ స్క్రాప్‌లపై అమల్లో ఉన్న 4 శాతం ప్రత్యేక అదనపు కస్టమ్స్ డ్యూటీ(ఎస్‌ఏడీ)కి మినహాయింపునివ్వాలి. మరోపక్క, యంత్రపరికరాల దిగుమతితో సంబంధం ఉన్న అన్ని ప్రాజెక్టులపై ఎస్‌ఏడీని విధించాలి.
ద్రవీకృత సహజవాయువు(ఎల్‌ఎన్‌జీ), కోకింక్ కోల్, వైన్, ఎయిర్ కండిషనర్స్ విడిభాగాలు, భద్రత(సేఫ్టీ) పరికరాల వంటి పలు కీలక ఉత్పత్తుల దిగుమతిపై సుంకాన్ని తగ్గించాలి.