న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం కాగ్నిజంట్ నికర లాభం ఈ మార్చి క్వార్టర్‌లో 17 శాతం తగ్గింది. గత ఏడాది మార్చి క్వార్టర్‌లో 44 కోట్ల డాలర్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో 37 కోట్ల డాలర్లకు తగ్గిందని కాగ్నిజంట్ తెలిపింది. ఆదాయం 3 శాతం వృద్ధితో 420 కోట్ల డాలర్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ బ్రియాన్ హంఫ్రీస్ వెల్లడించారు. కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో ఈ ఏడాది డిమాండ్ పరంగా సమస్యలు ఉండొచ్చని అంచనాలున్నాయన్నారు. అందుకే గతంలో వెలువరించిన ఈ ఏడాది ఆదాయ అంచనాలను వెనక్కి తీసుకుంటున్నామని వివరించారు. విభిన్నమైన సేవలందించడం, పటిష్టమైన బ్యాలన్స్ షీట్, లిక్విడిటీల దన్నుతో కరోనా కల్లోలాన్ని ఎదుర్కొనగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. మార్చి క్వార్టర్‌లో భారీ డీల్స్ సాధించామని బ్రియన్ వివరించారు. ఫ్రెషర్లకు 20,000 ఉద్యోగాలు ఇవ్వనున్నామని చెప్పారు. వ్యయాల నియంత్రణపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment