పసిడిపై ఆంక్షలు సడలిస్తేనే మంచిది
న్యూఢిల్లీ: అక్రమ రవాణాకు దారితీస్తున్న పసిడి దిగుమతులపై ఆంక్షలను సడలిస్తేనే మంచిదన్న అభిప్రాయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం వ్యక్తం చేశారు. బంగారంపై 10 శాతం ఉన్న దిగుమతుల సుంకం దేశీయ రత్నాలు, ఆభరణాల పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందన్న ఆందోళనల నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
‘‘వాణిజ్య మంత్రిగా బంగారంపై ఆంక్షలు తొలగాలనే నేను కోరుకుంటాను. రత్నాలు, ఆభరణాల పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు పడుతుండడమే దీనికి కారణం’ అని ఒక వార్తా సంస్థతో వ్యాఖ్యానించారు. దేశం మొత్తం ఎగుమతుల్లో రత్నాలు, ఆభరణాల వాటా దాదాపు 15 శాతం ఉన్న విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశం మొత్తం ఎగుమతుల విలువ ఆ యేడాది 312 బిలియన్లుకాగా, ఇందులో రత్నాలు, ఆభరణాల రంగం వాటా 39.5 బిలియన్ డాలర్లని అన్నారు.
పరిశ్రమకే కాకుండా, అక్రమ రవాణా పెరగడానికి సైతం ఆంక్షలు దారితీస్తున్నట్లు మంత్రి వ్యాఖ్యానించారు. ఈ అంశాలన్నింటినీ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పరిశీలనకు తీసుకువెళుతున్నట్లు వెల్లడించారు. ఆంక్షల వల్ల కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడి లక్ష్యం నెరవేరుతున్నప్పటికీ, ఈ మెటల్ అక్రమ రవాణా పెరిగి ఆందోళనకరమైన పాతరోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు.