అస్థిరతల నడుమ స్థిరమైన రాబడులు | Constant returns between the volatility | Sakshi
Sakshi News home page

అస్థిరతల నడుమ స్థిరమైన రాబడులు

Published Mon, Feb 19 2018 12:22 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

Constant returns between the volatility - Sakshi

ఈక్విటీ మార్కెట్లు అంటేనే ఆటుపోట్లకు నిలయాలు. ప్రపంచ పరిణామాలు, దేశీయ పరిణామాలన్నింటికీ ప్రతిస్పందిస్తూ ఉంటాయి. అయితే, ఈ ప్రభావం అంతా స్వల్పకాలిక పెట్టుబడులపైనే అధికం. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేసేవారికి ఈక్విటీలు రెండంకెల స్థాయిలో రాబడులు ఇచ్చినట్టు గణాంకాలు చూస్తే తెలు స్తుంది. కనుక రిస్క్‌ ఉన్నాగానీ, దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా గణనీయమైన రాబడులు ఆశించేవారు, అదే సమయంలో ఆటుపోట్లు సైతం పరిమితంగా ఉండాలనుకునే వారు, బ్లూచిప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ ఫండ్‌ను పరిశీలించొచ్చు. దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గ రాబడులను ఈ ఫండ్‌ అందించింది.


పనితీరు
ఐదేళ్ల కాలంలో ఈ ఫండ్‌ ఇచ్చిన రాబడులు వార్షికంగా సగటున 17.4 శాతంగా ఉన్నాయి. ఇదే సమయంలో బెంచ్‌ మార్క్‌ నిఫ్టీ– 500 రాబడులు 14.8 శాతానికే పరిమితమయ్యాయి. అంటే ఈ పథకం రాబడులు ప్రామాణిక సూచీని మించి ఉన్నాయి. అదే పదేళ్ల కాలంలో రాబడులను గమనిస్తే సగటున వార్షికంగా 13.3 శాతం చొప్పున ఉన్నాయి.

ఈ కాలంలో నిఫ్టీ– 500 రాబడులు 7.9 శాతమే. మూడేళ్ల కాలంలో 10.9 శాతం చొప్పున ప్రతిఫలాన్ని పంచింది. మధ్యస్థంగా రిస్క్‌ భరించేవారు, దీర్ఘకాలం పాటు కొనసాగేవారు ఈ ఫండ్‌ను పెట్టుబడుల కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఆటుపోట్లు పెరిగి, మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ వేల్యూషన్లు అధిక స్థాయికి చేరిన ప్రస్తుత సమయంలో ఈ పథకం అనువైనది. ఇది ప్రధానంగా బ్లూచిప్‌ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేస్తుంది.

2014లో ఈ ఫండ్‌ అసాధారణమైన పనితీరు చూపించింది. బెంచ్‌మార్క్‌ రాబడులు 35 శాతంగా ఉంటే, హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ ఫండ్‌ 53 శాతం రిటర్నులు ఇచ్చింది. అయితే, 2015, 2016 సంవత్సరాల్లో మాత్రం పనితీరులో వెనుకబడింది. బ్యాంకింగ్, ఐటీ రంగ స్టాక్స్‌ పెద్దగా రాణించకపోవడమే కారణం.

ఈ పథకం ప్రధానంగా బ్యాంకు లు, ఐటీ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేయడం వల్ల అలా జరిగింది. అయితే, 2017లో మళ్లీ మెరుగైన ప్రదర్శన చూపించింది. బ్యాంకింగ్‌ స్టాక్స్‌ ర్యాలీ కలిసొచ్చింది. గతేడాది 36.8 శాతం రాబడులు ఇచ్చింది. బెంచ్‌ మార్క్‌ పెరుగుదల 30.6 శాతంగానే ఉంది. బ్యాంకింగ్‌ రంగంలో రికవరీ, ఐటీ రంగం టర్న్‌ అరౌండ్‌ అయితే దీర్ఘకాలంలో ఫండ్‌ పనితీరు ఇంకా మెరుగ్గా ఉండే అవకాశం లేకపోలేదు.

పోర్ట్‌ఫోలియో, పెట్టుబడుల విధానం
ప్రాధాన్య రంగాలైన బ్యాంకింగ్, ఐటీతోపాటు కన్‌స్రక్షన్‌ ప్రాజెక్ట్స్, విద్యుత్‌ రంగం స్టాక్స్‌కు గడిచిన ఏడాదిలో ఎక్కువ  కేటాయింపులు చేసింది. దాదాపు 60 శాతం పెట్టుబడులు ఈ నాలుగు రంగాల్లోనే ఇన్వెస్ట్‌ చేసింది. ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలో ఐదు స్టాక్స్‌ వాటాయే దాదాపు 40 శాతంగా ఉంది. దీర్ఘకాల దృష్టితో ఫండమెంటల్‌ స్టాక్స్‌లో ఎక్స్‌పోజర్‌కు ప్రాధాన్యం ఇస్తుంది. స్వల్ప కాల దృష్టితో ఇన్వెస్ట్‌ చేయదు. పెట్టుబడుల్లో మార్పు, చేర్పులు గమనిస్తే ఎస్‌బీఐలో ఎక్స్‌పోజర్‌ తగ్గించుకుని, గడిచిన నాలుగు నెలల కాలంలో యాక్సిస్‌ బ్యాంక్‌ను పోర్ట్‌ఫోలియోలో చేర్చుకుంది.

రిలయన్స్‌ నిప్పన్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని కూడా చేర్చుకుంది. అలాగే, అవెన్యూ సూపర్‌మార్ట్స్, వేదాంత, టాటా కెమికల్స్, సెంచురీ టెక్స్‌టైల్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్, కంటెయినర్‌ కార్పొరేషన్‌ స్టాక్స్‌ను కూడా యాడ్‌ చేసుకుంది. ఆటోమొబైల్స్, మీడియా ఎంటర్‌టైన్‌మెంట్, రవాణా, పెస్టిసైడ్స్‌ రంగాల్లో పెట్టుబడులను గణనీయంగా తగ్గించుకుంది. మారుతి సుజుకీ, నెట్‌వర్క్‌ 18, అదానీ పోర్ట్స్‌లో లాభాలను స్వీకరించింది. అలాగే, భారతీ ఎయిర్‌టెల్, బీపీసీఎల్, ఎన్‌హెచ్‌పీసీ, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జ్యూమర్‌ స్టాక్స్‌లో గడిచిన ఏడాదిలో పెట్టబడులను పూర్తిగా వెనక్కి తీసేసుకుంది. మిడ్, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌కు 22 శాతం పెట్టుబడులను కేటాయించింది.


టాప్‌ హోల్డింగ్స్‌
స్టాక్‌                          పెట్టుబడుల శాతం
ఐసీఐసీఐ బ్యాంకు             10.1
లార్సన్‌ అండ్‌ టూబ్రో           9.80
ఎస్‌బీఐ                          9.43
ఇన్ఫోసిస్‌                        7.54
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు           5.97
ఆర్‌ఐఎల్‌                        3.73
బాలకృష్ణ ఇండస్ట్రీస్‌            3.14
యాక్సిస్‌ బ్యాంకు              2.72
సీఈఎస్‌సీ                      2.68
గెయిల్‌                          2.50

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement